
అమ్రాబాద్, వెలుగు: మాచారంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు. పనులన్నీ శరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మొక్కలు నాటారు. బోరు బావులు, సౌర ఫలకాల పనితీరును తెలుసుకున్నారు. హెలిప్యాడ్, భద్రతా అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ సంతోష్ నాయక్, డీఎఫ్ వో రోహిత్ గోపిడి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు..
కల్వకుర్తి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చాయని ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడితే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అవేమీ పట్టించుకోకుండా తమ కుటుంబం, పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు.
ఈ నెల18న మన్ననూరు మండలంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రుణమాఫీ చేసి, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం కింద రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్, నాయకులు విజయ్‌కుమార్ రెడ్డి, ఆనంద్ కుమార్ శ్రీకాంత్ రెడ్డి, రాములు, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.