కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఏకమై మోదీని గద్దె దించాలి : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఏకమై మోదీని గద్దె దించాలి : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  • ఆనాడు బ్రిటిషర్లతో ఎంతో.. ఇప్పుడు బీజేపీతో అంతే ప్రమాదం: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  •     బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను వంద మీటర్ల గోతిలో పాతిపెట్టాలని పిలుపు 
  •     సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ప్రసంగం
  •     పాలేరులో రూ.362 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం 

ఖమ్మం, వెలుగు:  కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై నరేంద్ర మోదీని గద్దె దింపి, రాహుల్‌‌‌‌గాంధీని ప్రధాన మంత్రిని చేద్దామని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బీజేపీ 400 సీట్లు అడిగిందని, కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పోరాటంతో బీజేపీ వెనుకడుగు వేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అందుకే పేదల రాజ్యాంగ హక్కు అయిన ఓట్లను తొలగించేందుకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌‌‌‌‌) తీసుకొచ్చారన్నారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. ‘‘సర్‌‌‌‌‌‌‌‌ను తెచ్చి ఆదివాసీలను ఆధారాలు, ఆనవాళ్లు తెమ్మని అంటున్నారు. 

ఇక్కడే పుట్టి ఇదే మట్టిలో జీవించే ఆదివాసీలు ఎక్కడి నుంచి ఆధారాలు తెస్తారు. ఓటు హక్కు పోతే రేషన్ కార్డు, ఆస్తులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందవు. ఓటు తొలగిస్తే అన్నీ కోల్పోతారు. అందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. అందరూ ఏకమై నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి. అందుకే సీపీఐ సోదరులు అడగగానే ఈ సభకు వస్తానని చెప్పాను” అని అన్నారు. 

ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదు.. 

మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసి వచ్చినా ఖమ్మంలో ఇద్దరు సర్పంచ్‌‌‌‌లను కూడా గెలిపించుకోలేరని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు. ‘‘కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మంలో జరుగుతున్న ఈ సభ మతపరపార్టీలకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నిటారుగా నిలబడి పోరాడుతుందని చాటుతున్నది. మరో వందేండ్లపాటు ప్రజల కోసం నిరంతరం కొట్లాడుతామని చెప్పారు. 

బ్రిటిష్ వారిపై కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కొట్లాడితేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆదివాసీలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల కోసం కమ్యూనిస్టులు ప్రభుత్వాల మీద యుద్ధమే ప్రకటించారు. దున్నే వాడిదే భూమి అని కమ్యూనిస్టులు నినాదం ఇస్తే, దాన్ని చట్టం చేసి, సీలింగ్ యాక్టు తెచ్చి పేదలకు భూములను పంచిన ఘనత కాంగ్రెస్ ది. రైతు కూలీల హక్కుల కోసం మీరు పోరాడితే కాంగ్రెస్​ కనీస వేతన చట్టం చేసింది. సాయుధ పోరాటంలో 4 వేల మంది వీరులు నేలకొరిగారు. నెహ్రూ మిలిటరీ యాక్షన్ వల్లే హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం నుంచి విముక్తి లభించింది. 

ఆనాడు బ్రిటిష్ వాళ్లతో ఎంత ప్రమాదం ఉండెనో.. ఇప్పుడు బీజేపీతో కూడా అంతే. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. పేదలకు మేలు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారు. రైతులు, రైతు కూలీలు పట్టణాలకు వలస వెళ్లేలా బీజేపీ చేస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు ప్రజల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో రావడంలో సీపీఐ శ్రమ, సహకారం కూడా ఉన్నాయని చెప్పారు. 

బీఆర్ఎస్‌‌‌‌ను బొందపెట్టాలి..

 పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సింగ్ కాలేజీని ప్రారంభించి, అక్కడి స్టూడెంట్స్‌‌‌‌తో ఇంటరాక్ట్ అయ్యారు. మున్నేరు, పాలేరు లింక్​ కెనాల్‌‌‌‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఉత్తమ్​ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, వాకిటి శ్రీహరితో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం పాటుపడడంలో ఎన్టీఆర్, వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతేనే మరొకరికి రేషన్​ కార్డు ఇచ్చే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కానీ తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. 

తెలంగాణలో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కు అభిమానులు ఉన్నారని, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని, ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను, బీఆర్ఎస్‌‌‌‌ను సమూలంగా 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టినపుడే ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కు నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని అన్నారు. బీఆర్ఎస్‌‌‌‌ను బొంద పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

పదేండ్లు కాంగ్రెస్‌‌‌‌దే అధికారం.. 

 గతంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్న పదేండ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం​ ఇండ్లు ఇస్తామని బీఆర్ఎస్​ నేతలు ఊరించి మోసగించారన్నారు. పదేండ్లలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు రూ.20 లక్షల కోట్లు వచ్చాయని, ఏడాదికి 2 లక్షల ఇండ్లు కట్టిచ్చినా, పేదలందరికీ ఇండ్లు దక్కేవన్నారు. 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదే 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రాలు వేరైనా, వాళ్ల కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా ఎన్టీఆర్, వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ను ఆదర్శంగా తీసుకొని తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్, తెలంగాణ వచ్చాక పదేండ్లు బీఆర్ఎస్​ అధికారంలో ఉందని, మరో పదేండ్లు కాంగ్రెస్​ దే అధికారం అని అన్నారు. ‘‘నాకంటే పెద్దలు, అనుభవం ఉన్న వాళ్లు ఇక్కడ ఉన్నారు. అయినా సోనియమ్మ, రాహుల్, ఖర్గే నాకు సీఎంగా అవకాశం ఇచ్చారు. సీనియర్​ మిత్రులంతా నాకు సహకరిస్తున్నరు” అని పేర్కొన్నారు. 

కష్టాన్ని నమ్ముకొని, క్రమశిక్షణతో పనిచేస్తే భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని కార్యకర్తలకు చెప్పారు. ‘‘2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్‌‌‌‌ను గద్దె దించిన్రు. ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పిన్రు. సర్పంచ్​ ఎన్నికల్లో 66 శాతం మద్దతిచ్చి కాంగ్రెస్‌‌‌‌ను ఆశీర్వదించిన్రు. రేపు మున్సిపాలిటీల్లో 70 శాతానికిపైగా కాంగ్రెస్‌‌‌‌ను గెలిపించాలి” అని కోరారు. చిన్న చిన్న విషయాలుంటే అంతర్గత సమావేశాల్లో చర్చించి, బీఫామ్​ ఇచ్చిన వాళ్ల గెలుపుకోసం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.