నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం సభ సక్సెస్తో .. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్

నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం సభ సక్సెస్తో .. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్

నాగర్​కర్నూల్, వెలుగు:నాగర్​కర్నూల్​ జిల్లాలో సీఎం పర్యటన కాంగ్రెస్  నేతల్లో జోష్​ నింపింది. శుక్రవారం కొల్లాపూర్​ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోల్​లో సీఎం రేవంత్​రెడ్డి యంగ్  ఇండియా రెసిడెన్షియల్​ స్కూల్​కు శంకుస్థాపన చేసిన అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందజేశారు. సీఎం పర్యటన కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా అధికార యంత్రాంగం మూడు రోజులుగా శ్రమించారు. శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం పడడంతో సీఎం సభ ఎలా జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. 

వర్షం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బహిరంగ సభకు జనాలు భారీగా తరలిరావడం కాంగ్రెస్  నాయకుల్లో జోష్​ నింపింది. సీఎం, మంత్రి జూపల్లి ప్రసంగాలకు జనాల నుంచి మంచి రెస్సాన్స్​ వచ్చింది. కేసీఆర్, బీఆర్ఎస్​ నాయకులపై విమర్శలు చేసినప్పుడు కాంగ్రెస్​  శ్రేణులు స్పందించారు. ముందుగా మదన గోపాలస్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నాక రెసిడెన్షియల్​ స్కూల్​కు శంకుస్థాపన చేసి వేదిక మీదికి వచ్చారు.

కొల్లాపూర్​ను పట్టించుకోండి మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్​ నియోజకవర్గం అన్నిరంగాల్లో వెనకబడిందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం రిజర్వాయర్  నిర్మాణం కోసం  భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి జీవో 98 జారీ చేసి 40 ఏండ్లు దాటిందని తెలిపారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. మాదాసీ కుర్వలు, వాల్మీకి కులస్తుల చిరకాల కోరిక, డిమాండ్లను తీర్చాలని, కొల్లాపూర్​ పట్ణణ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు, నియోజకవర్గానికి రూ.500 కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి అదనంగా 3 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. 

బాచారం హైలెవల్​ కెనాల్​ నిర్మాణం, రంగస్వామి రిజర్వాయర్​ నుంచి వచ్చే యెనుకుంట కాల్వ విస్తరణ చేపట్టాలన్నారు. పెంట్లవెల్లి పీఏసీఎస్​లో సాంకేతిక కారణాలతో రుణమాఫీకి నోచుకోని 499 మంది రైతులకు న్యాయం చేయాలని కోరారు. నవోదయ పాఠశాల, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్​ కాలేజీలు మంజూరు చేయాలన్నారు. ఆగ్రో, మ్యాంగో, ఫిష్​ ప్రాసెసింగ్​ యూనిట్లు శాంక్షన్​ చేయాలని కోరారు. స్పందించిన సీఎం సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి,అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్​రెడ్డి, పర్ణికారెడ్డి, ఈర్లపల్లి శంకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్  పాల్గొన్నారు.