
- మాచారం సభకు వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు
- పటిష్ట బందోబస్తు మధ్య సాగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- అడుగడుగునా సీఎంకు జేజేలు పలికిన ఆదివాసీలు
అమ్రాబాద్/వంగూర్, వెలుగు:సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో మొదటిసారి పర్యటించారు. ఈ ప్రాంతం సీఎం స్వస్థలం కావడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆయన పర్యటనలో ఆసాంతం యువకులు ‘నల్లమల పులి బిడ్డ’ అంటూ అని నినాదాలు చేస్తూ ఫుల్ జోష్‌లో కనిపించారు. మాచారం గ్రామానికి ఉదయం 11.50 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన ముందుగా ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
అక్కడే ఏర్పాటు చేసిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పైలాన్‌ను ఆవిష్కరించారు. స్కీమ్‌లో భాగంగా సోలార్ పంపుల ద్వారా ఉద్యానవన పంటల్లో ఏర్పాటు చేసిన డ్రిప్, స్ర్పింక్లర్లను ఆయన స్విచ్ఆన్ చేసి ప్రారంభించారు. అక్కడే ఉన్న చెంచు లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం తోటల్లోకి వెళ్లి డ్రిప్‌ను పరిశీలించారు. ఆ సమయంలో ఆయన నీటిలో తడిసిపోయారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. అక్కడి నుంచి వంగూర్ మండలంలోని ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన్ను గజమాలతో సత్కరించారు. గ్రామంలో సీఎం కుటుంబసభ్యులు రూ.3 కోట్ల తమ సొంత డబ్బులతో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో సీఎం దంపతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులతో కలిసి సీఎం తన నివాసంలో భోజనం చేశారు. కార్యక్రమం ముగిశాక రోడ్డు మార్గాన తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండ సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు..
ప్రజలకు ఏది కావాలో అది చేసేదే తమ ప్రజా ప్రభుత్వం అని ఎంపీ మల్లు రవి చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. విప్లవాత్మక పాలన చేటపట్టడంతో.. దీనిని ఓర్వలేక ప్రతిపక్షాలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. త్వరలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో సీఎంతో మరో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
నాటి ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాల ద్వారా ఆదివాసీలకు హక్కులు దక్కాయన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని, మన్ననూరు ఐటీడీఏకు పూర్తి స్థాయి అధికారిని నియమించాని ఆమె సీఎంను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అటవీ శాఖ ద్వారా పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు.
రూ.వంద కోట్ల నిధులివ్వండి..
అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం రూ.వంద కోట్ల నిధులు కేటాయించాలని సీఎంను స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కోరారు. మాచారం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఊటీగా పిలిచే నల్లమలను టూరిజం హబ్ గా డెవలప్ చేయాలని కోరారు. ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు. మద్దిమడుగు–మాచర్ల బ్రిడ్జికి అనుమతులు ఇప్పించాలని, అచ్చంపేటలో నూతన డిగ్రీ కాలేజీతో పాటు జూనియర్ కాలేజీ భవనం మంజూరు చేయాలని.
పదర–మద్దిమడుగు, కొండారెడ్డిపల్లి–హాజీపూర్, మన్నెవారిపల్లి–హాజీపూర్ వరకు డబుల్ రోడ్లు మంజూరు చేయాలన్నారు. చెంచుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని కోరారు. అలాగే నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయాలని ఆయన సీఎంకు విన్నవించారు.