తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు మూడేళ్లలో సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భూ ఆక్రమణల వెనుక ఎవరున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఐఎంజీ భూముల వ్యవహారంలోనూ తమ ప్రభుత్వం కోర్టుల్లో బలంగా వాదనలు వినిపించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.40 వేల కోట్ల విలువైన భూములను ఐఎంజీకి కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. హయత్‌నగర్‌లో 201 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు చెప్పారు.మంచిరేవులలోని 163 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేటీఆర్ ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అందులో 50 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల విలువైన భూమిని కాపాడామని, భూపాలపల్లిలో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకే ఆ భూమిని బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. కోర్టులో న్యాయపోరాటం చేసి ఆ ప్రభుత్వ భూమిని తిరిగి కాపాడామని వెల్లడించారు.
