మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతవ్ : సీఎం రేవంత్​రెడ్డి

మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతవ్ : సీఎం రేవంత్​రెడ్డి
  • బిడ్డా.. ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి 
  • కేసీఆర్​కు ముఖ్యమంత్రి హెచ్చరిక 
  • నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు
  • నీ కారును ఇగ ఇనుప సామాన్లోడికి అమ్ముడే
  • నువ్వు మా దిక్కు చూసుడు కాదు.. నీ దొడ్లో ఎంతమంది ఉంటరో చూస్కో 
  • బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం 
  • కేసీఆర్​ను ఇంటికి పంపినట్టే.. మోదీని జనం గద్దె దించుతరు  
  • మహబూబ్​నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు

మహబూబ్​నగర్/మహబూబాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్​ను సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘నిన్న పిట్టలదొర మాట్లాడుతున్నడు. ‘నాతో 20 మంది కాంగ్రెస్​ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నరు. చిట్కె వేస్తే వస్తరు’ అంటున్నడు​. చిట్కె కాదు బిడ్డా.. నువ్వు మిద్దెక్కి డప్పు కొట్టు. నీ దగ్గరున్నోళ్లు కూడా ఎవరన్న ఉంటరేమో చూద్దాం. మా ఎమ్మెల్యేలను ఎట్ల తీస్కపోతవో చూస్తా.. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్​రెడ్డి. వాళ్లను కంచె వేసి కాపాడుకునే శక్తి, హైటెన్షన్​వైర్​ లాంటోడు ​రేవంత్​రెడ్డి.. వచ్చి ముట్టుకో.. కరెంట్ తీగ మీద కాకికి షాక్​ కొడితే ఎట్ల కర్రెగై చస్తదో.. కాంగ్రెస్​ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అయితది. నువ్వు మా దిక్కు చూసుడు కాదు.. సాయంత్రం నీ దొడ్లో ఎంతమంది ఉంటరో ఒకసారి లెక్క పెట్టుకో” అని ఫైర్ అయ్యారు.

శుక్రవారం మహబూబ్​నగర్​లో కాంగ్రెస్​అభ్యర్థి చల్లా వంశీచంద్​రెడ్డి నామినేషన్​ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో, అనంతరం మహబూబాబాద్​లో బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దిగిపోవాలని కేసీఆర్ అంటున్నడు. మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి రాలేదు. ప్రజల మద్దతుతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అలాంటి ప్రభుత్వాన్ని దించడం కేసీఆర్​తో కాదు కదా.. వాళ్ల నాయిన దిగొచ్చినా సాధ్యం కాదు” అని ఆయన అన్నారు. ఆరునూరైనా ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.  

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులే అయిందని, కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్​ మాటలు చూస్తే పిట్టల దొరకు తాతలాగా ఉన్నాయి. ‘తండ్రికి తద్దినం పెట్టనోడు.. చిన్నాయనకు పిండాలు పెడతాడంట’ అన్నట్లుంది ఆయన పరిస్థితి. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు. ఎదురు పార్టీల ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని పిట్ట కథలు చెప్పి ఎన్నాళ్లు బతుకుతావ్. నీ కథలకు కాలం చెల్లింది. నీ కారు షెడ్డుకు పోయింది.

కారు ఖరాబైందని, గ్యారేజ్​కు వెళ్లిందని ఇటీవల కేటీఆరే చెప్పాడు.​ కేటీఆర్.. నీ కారు ఖరాబు కాలే.. నీ కారు ఇంజిన్​ చెడిపోయింది. తూకం పెట్టి అమ్ముడే. వర్క్​షాప్​​ నుంచి ఇంటికి రాదు. ఇనుప సామన్లోడికి అమ్ముడే. నీ కారే కాదు.. నీ నాయన ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఏ తారీఖున ప్రమాణ స్వీకారం చేశామో.. అదే రోజున మీ నాయన బోర్ల పడ్డడు. బొక్కలు ఇరిగినయ్” అని అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కారును జనం బండకేసి కొట్టారని, వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారని అన్నారు. 

పాలమూరు పౌరుషాన్ని చూపిద్దాం.. 

‘‘పదేండ్లు మోదీని చూసినం.. కేసీఆర్​ను చూసినం. గత డిసెంబరులో కేసీఆర్​ను బొంద పెట్టినం. ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి, పాలమూరు పౌరుషాన్ని చూపించాలి” అని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. ‘‘దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆర్ఎస్​కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే తాబేలు, కుందేలు కథ అయితది. కాంగ్రెస్​కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు.. నడిస్తే చాలు. ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చినా.. ఈ అడ్డా మీద మూడు రంగుల జెండా ఎగురవేసే మొనగాళ్లు మనోళ్లే.

అందుకే దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ర్టానికి పిలుపు వస్తోంది. నిన్న కేరళ పోయిన.. రేపు కర్నాటక, ఎల్లుండి మహారాష్ర్ట పోతున్న. ఏడికిపోయిన నేను చెప్పేది ఒకటే మాట.. నా అడ్డా, గడ్డ పాలమూరు బిడ్డా అని. మీ మీద బాధ్యత పెట్టి పోతున్నా. నాకు ఏ అవకాశం ఉన్నా.. మళ్లీ పాలమూరుకు వస్తా. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​పార్లమెంట్ అభ్యర్థులు చల్లా వంశీచంద్​ రెడ్డి, మల్లు రవిని గెలిపించాలి. రెండు నియోజకవర్గాల్లో లక్ష చొప్పున మెజార్టీ ఇప్పించాలి” అని కోరారు.  

మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇచ్చిన్రు.. 

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఏమిచ్చిందని, అలాంటి పార్టీకి ఎందుకు ఓటు వేయాలని రేవంత్ ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్​ఫ్యాక్టరీ రాలేదు. గిరిజన యూనివర్సిటీ కాలేదు. మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి’’ అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ‘‘ఉత్తరాదిన కుంభమేళాకు, గంగానది ప్రక్షాళనకు వేల కోట్ల నిధులు కేటాయించారు. కానీ తెలంగాణలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారానికి ముష్టి రూ.3 కోట్లు కేటాయించడం దారుణం. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమని జాతరలో నిలబడి చెప్పిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి.. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారు” అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించి, మేడారం జాతరను ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్​తోనే మానుకోట అభివృద్ధి.. 

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందని రేవంత్ అన్నారు. ‘‘అప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుందాం. గిరిజన యూనివర్సిటీ పూర్తి చేసుకుందాం. మేడారం జాతరకు జాతీయ హోదా కూడా తెచ్చుకుందాం. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి” అని ప్రజలను కోరారు. కార్నర్ మీటింగ్, జన జాతర సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​ రావు, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, మహబూబాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్లు చల్లా వంశీచంద్​ రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

పాలమూరుకు పది పైసలైనా ఇవ్వలేదు.. 

కేసీఆర్, మోదీ పదేండ్లు అధికారంలో ఉన్నా పాలమూరుకు చేసిందేమీ లేదని రేవంత్ మండిపడ్డారు. ‘‘ఇయ్యాల అధికారం మన చేతిలో ఉంది. మనం శత్రువు చేతిలో కత్తి పెడితే, మన కడుపులోనే పొడుస్తడు. డీకే అరుణ మోదీ ప్రభుత్వంలో చేరింది. కేసీఆర్ దగ్గర చాలామంది తాబేదార్లు ఉన్నారు. ఈ మొనగాళ్లు వాళ్ల దగ్గరికి పోయి మన పాలమూరుకు పది పైసలైనా తెచ్చిన్రా? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చిన్రా? కానీ డీకే అరుణ మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకుంది. పదేండ్లు అధికారంలో ఉన్న వీళ్లు పాలమూరును ఎడారిగా మార్చిన్రు’’ అని ఫైర్ అయ్యారు.

‘‘పాలమూరులో కాంగ్రెస్​ను ఓడగొట్టేందుకు గద్వాల గడీల నుంచి దొరసాని బయల్దేరింది. గద్వాల గడీల దొరలైనా.. గజ్వేల్​ ఫామ్​హౌస్​ దొరలైనా.. మిమ్మల్ని తొక్కుకుంటూ పార్లమెంట్​కు కాంగ్రెస్ అభ్యర్థులను పంపించేందుకు మా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారు” అని అన్నారు. ‘‘మహబూబ్​నగర్ బీఆర్ఎస్​ ​ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి పార్లమెంట్​లో ఐదేండ్లు పల్లెతు మాట మాట్లాడిండా? పాలమూరు స్కీమ్ గురించి ప్రస్తావించిండా? ఆయన మనిషి మంచోడే.. కానీ మంచం మీద పడ్డడు. లేవనికే చేతకాదు.. లేస్తే మాట్లాడే అధికారం కూడా లేదు” అని అన్నారు. 

కేసీఆర్​కు చెప్పినట్టే మోదీకి బుద్ధి చెప్పాలె.. 

ఇచ్చిన హామీలేవీ ప్రధాని మోదీ అమలు చేయలేదని రేవంత్ మండిపడ్డారు. ‘‘అధికారంలోకి వస్తే  నల్లధనం వెలికితీసి, ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇవేవీ అమలు చేయలేదు. కానీ దేశ సంపదను మాత్రం పెట్టుబడి దారులకు దోచిపెట్టారు” అని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదని ఆరోపించారు. ‘‘బీజేపీ తెచ్చిన జీఎస్టీ, నల్ల చట్టాలకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతు     న్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేడీ కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్​కు కూడా బుద్ధి చెప్పాలి. ఇక్కడి కేడీని ఇంటికి పంపినట్టే, అక్కడి మోదీని కూడా గద్దె దించాలి” అని ప్రజలను కోరారు. 

పదేండ్లు మోదీని చూసినం.. కేసీఆర్​ను చూసినం. గత డిసెంబరులో కేసీఆర్​ను బొంద పెట్టినం. ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి.దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆర్ఎస్​ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే తాబేలు, కుందేలు కథ అయితది. కాంగ్రెస్ ​కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు.. నడిస్తే చాలు. ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చినా.. ఈ అడ్డా మీద మూడు రంగుల జెండా ఎగురవేసే మొనగాళ్లు మనోళ్లే. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్​ఫ్యాక్టరీ రాలేదు. గిరిజన యూనివర్సిటీ కాలేదు. మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి.
- సీఎం రేవంత్​రెడ్డి