
- ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆఫీసర్ల బృందం కూడా
- నేటి నుంచి ఈ నెల18 వరకు పర్యటన
- అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో భేటీ
- రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల15 నుంచి 18 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ఈ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు పాల్గొననున్నారు. ఆదివారం మణిపూర్ లో రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం, సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం అర్ధరాత్రి1:45 నిమిషాలకు స్విస్ ఎయిర్ లైన్స్ లో స్విట్జర్లాండ్ లోని జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరి వెళ్లారు.
మూడు రోజుల పాటు దావోస్ వేదికగా జరిగే సదస్సులో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం, ఐటీ మంత్రి భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించనున్నారు. ఈ సదస్సు ముగిసిన అనంతరం18వ తేదిన జూరిచ్ నుంచి లండన్ వెళ్తారు. అక్కడి నుంచి 20వ తేదిన దుబాయ్ మీదుగా బయలుదేరి.. 21న ఉదయం 8:25 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.-
ఎకనామిక్ ఫోరం మంచి వేదిక: శ్రీధర్‌బాబు
తొలిసారి దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని, ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో మాట్లాడుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అక్కడ జరిగే చర్చాగోష్టిలో ‘పురోగమిస్తున్న వైద్యరంగం’పై రేవంత్తన అభిప్రాయాలను పంచుకుంటారని చెప్పారు. ‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’ అనే అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని అగ్రి -ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై సీఎం ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
ఏఐ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’ అనే అంశంపై సీఎం మాట్లాడతారని, టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాసీ భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా ఆయన కలుసుకుంటారని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని పేర్కొన్నారు. ఈ నెల15వ తేదీ నుంచి19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం వెళ్తున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంబంధిత వివరాలను వెల్లడించారు.
బ్రెండే బోర్జ్తో భేటీ..
విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని తెలంగాణ కొత్త ప్రభుత్వ విజన్, ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అని ఆయన తెలిపారు. మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను, సీఎం కలిసి దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్లు వెల్లడించారు.
తాము కలువబోయే వారిలో నోవర్టీన్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెనికా, గూగుల్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారని తెలిపారు. భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ కావడమే కాకుండా సీఐఐ, నాస్కామ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో సమావేశమవుతామని వివరించారు.
దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్ తో సమావేశం అవుతామని ప్రకటించారు.