ఇవాళ (మే 23న) జహీరాబాద్​కు సీఎం

ఇవాళ (మే 23న) జహీరాబాద్​కు సీఎం
  • రూ.100 కోట్ల నిమ్జ్  రోడ్డు, రైల్వే బ్రిడ్జి, కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవాలు
  • ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్  నియోజకవర్గంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లో సీఎం పర్యటించి ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులోభాగంగా గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కర్, నారాయణఖేడ్  ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, కలెక్టర్  వల్లూరు క్రాంతి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.  సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభాస్థలితో పాటు హెలిప్యాడ్  స్థలాన్ని పరిశీలించారు. హైవే పక్కన పస్తాపూర్ లో బహిరంగ సభతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన స్టాల్స్  ఏర్పాటు చేశారు.

రూ.494.67 కోట్ల పనులకు..

జహీరాబాద్  నియోజకవర్గంలో రూ.494.67 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హైవే నుంచి ఝరాసంగం నిమ్జ్  ప్రాజెక్టు వరకు రూ.100 కోట్లతో 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫోర్ లైన్  రోడ్, మాచ్నూర్ లో రూ.26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్  రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం, బసవేశ్వర విగ్రహావిష్కరణతో పాటు రూ.268.67 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పస్తాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.