హైదరాబాద్: తెలంగాణకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘తెలంగాణకు మంచి రోజులు వస్తాయని కేసీఆర్ అంటున్నారు.. పదేండ్ల దోపిడీ చాలలేదా..? తెలంగాణను పీక్కతిన్నా మీ ఆకలి తీరలేదా..? రాష్ట్రాన్ని రూ.8 లక్షల అప్పుల పాలు చేసినా మీ కడుపు నిండలేదా..?’’ అని ప్రశ్నించారు.
గతంలో కేసీఆర్ ఎలా ఉండేవారు.. ఎవరినైనా కలిసేవారా..? కనీసం వాళ్ల ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు.. కేబినెట్ మంత్రులను కూడా గేట్ దగ్గర నుంచే వెనక్కి పంపారు.. కానీ ఇప్పుడు ఇద్దరు సర్పంచులు, నలుగురు వార్డ్ మెంబర్లను పిలిపించుకుని మాట్లాడుతుండని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరండం అంటే బీఆర్ఎస్ను బండకేసి కొట్టారు.. బీఆర్ఎస్కు కేటీఆరే గుదిబండ.. మీ కొడుకు ఉన్నంతకాలం బీఆర్ఎస్ను బండకేసి కొడతానే ఉంటారన్నారు.
ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం (డిసెంబర్ 6) నల్గొండ జిల్లా దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. పదేండ్లు పగబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టారు.. ఇప్పుడేమో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులు ఆగాయని మామ, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారని విమర్శించారు.
ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. నీళ్లు పారించినట్లు.. నిధులు పారించి దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. లంబాడాలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. గిరిజనుల మధ్య పంచాయతీ పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఏమన్నారంటే..?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు శుక్రవారం (డిసెంబర్ 5) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ పల్లెలకు మంచిరోజులు వస్తాయని.. అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని సూచించారు. బీఆర్ఎస్ పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామాలు స్వయంసమృద్ధి సాధించాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఏదో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. కష్టాలకు వెరవద్దని ధైర్యం చెప్పారు. ప్రణాళికలు వేసుకొని పల్లెలు బాగుచేసుకుందామన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలకు పై విధంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
