అడ్డుకోకండి.. ఎకరాకు 20 లక్షలు ఇప్పించే బాధ్యత నాదే: సీఎం రేవంత్

అడ్డుకోకండి.. ఎకరాకు 20 లక్షలు ఇప్పించే బాధ్యత నాదే: సీఎం రేవంత్

మహబూబ్ నగర్: లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‎లో 1300 ఎకరాల భూమి తీసుకుంటే అది నా కోసమా..? నా సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేది నా తపన అని స్పష్టం చేశారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మహబూబ్ నగర్‎లో ప్రభుత్వం రైతు పండగ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం (శనివారం 30) రైతు పండగ ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

రాష్ట్రంలో గతంలో ఎవరూ భూ సేకరణ చేయలేదా.. ప్రాజెక్టులు కట్టలేదా..? గతంలో కూడా అధికారులపై ఇలాగే దాడులు చేసి ఉంటే ప్రాజెక్టులు వచ్చేవా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు నష్టపోవాల్సిందేనని.. అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ జరగాలని అన్నారు. కాని కొందరు మాయగాళ్ల మాటాలు విని పరిశ్రమలను అడ్డుకుంటున్నారని.. అభివృద్ధిని అడ్డుకోకుండా సహకరించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భూ సేకరణలో భూమి కోల్పోయిన వారికి రూ.20 లక్షలు ఇచ్చే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. 

కొడంగల్‎లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తాం.. 25 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం.. ఇది నా బాధ్యత అని అన్నారు. మాయగాళ్ల మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ బాధితులు ఎంత బాధపడ్డారో హరీష్ రావుకు తెలియదా అని నిలదీశారు. పాలమూరు భూమిని పంచి పెడితే.. చరిత్ర నన్ను క్షమిస్తుందా..? ఈ ప్రాంత బిడ్డగా జిల్లాకు నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర  నన్ను క్షమిస్తుందా అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే బాధ్యత నాదన్నారు.