పాలమూరంటే కాంగ్రెస్‌కు ప్రేమ : సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి

పాలమూరంటే కాంగ్రెస్‌కు ప్రేమ :  సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి
  • సభకు ఉమ్మడి జిల్లా నుంచి తరలి వచ్చిన ప్రజలు
  • పాలమూరు’లో 80 శాతం నిధులు తిని 30 శాతం పనులు చేసిండ్రు
  • సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​ రెడ్డి

పాలమూరు, వెలుగు : పాలమూరు అంటే కాంగ్రెస్​కు ప్రేమ అని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్​ హామీ ఇచ్చారు.  మహబూబ్​నగర్​లోని ఎంవీఎస్​ కాలేజ్​ గ్రౌండ్​ బుధవారం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.  సభ ప్రారంభానికి ముందు ఆయన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు మరో రెండు నియోజకవర్గాలకు చెందిన లీడర్లు పేర్లను చదివారు.  

పాలమూరు పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి చల్లా వంశీచంద్​రెడ్డి ప్రసంగానికి ముందు కొత్త పెళ్లికొడుకు అంటూ సంబోధించారు.  సీఎం అయ్యాక మూడు నెలల తర్వాత రేవంత్​రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు సభకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు లక్ష మంది వచ్చారు.  సభ నిండిపోవడంతో దాదాపు మరో 50 వేల మంది రోడ్లపైనే ఆయన్ను చూసేందుకు బారులు తీరారు.

విద్య, వైద్యంపైనే దృష్టి

పాలమూరులో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు పని చేస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.  ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని డెవలప్​ చేస్తామన్నారు.  వేగంగా అనుమతుల ఇచ్చి, నిధులు మంజూరు చేస్తామన్నారు.  పాలమూరును అభివృద్ధిలో నడిపించే బాధ్యత తనదని,  ఈ జిల్లాను దేశంలో ఆదర్శ జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చారు.  

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు అందిస్తామన్నారు.  కార్యకర్తలు మనల్ని నమ్మి భుజానా మోస్తారని, వారి సహకారం ఉంటేనే మనం పదవుల్లో ఉంటామన్నారు. వాళ్లే శాశ్వతమని, పదవులు కావని అన్నారు.  2006 కార్యకర్తగా పాలమూరు వలసలు, ఆత్మహత్యలు ఆగాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇండిపెండెంట్​గా నిలబడితే కష్టం అని చెప్పారు. ఒక అడుగు ముందుకేసీ అదే ఏడాది జూన్‌లో  మిడ్జిల్ జడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా నిలిబడిన తనను గెలిపించారన్నారు.  చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు జిల్లా అభ్యున్నతికి పని చేస్తానని చెప్పానని గుర్తు చేసుకున్నారు.

కేసీఆర్ పాలమూరు మీద పగబట్టిండు

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లుగా రాష్ర్టం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశాయన్నారు.  కేసీఆర్‌‌కు పాలమూరుపై పగబట్టి ఎడారిగా మార్చిందన్నారు.  గత అన్యాయాన్ని తుడిచి పెట్టి పాలమూరుకు న్యాయం చేసుకోవాలనే 'పాలమూరు న్యాయ్​ యాత్ర' చేపట్టినట్లు వివరించారు.  రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించుకుంటే మన ప్రాంతం నుంచి పాదయాత్ర చేసిన రాహుల్​ ప్రధాని అవుతారన్నారు.  

అప్పుడు పాలమూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.  జలయజ్క్షం ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే పాలమూరు బీళ్లు తడుస్తున్నాయన్నారు.  2014 ఆగస్టులో జీవో  72  ద్వారా పాలమూరు స్కీమును కాంగ్రెస్​ ప్రారంభించిందని గుర్తు చేశారు.  బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక పగ పెట్టుకొని ఈ స్కీమును పదేండ్లల్లో 80 శాతం నిధులు బుక్కి,  30 శాతం పనులు చేసిందన్నారు.  ఫుల్​బాటిల్​ ఎత్తుతుండ్రు గాని ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.