
- ఈ ఏడాది లక్ష్యం18 కోట్ల మొక్కలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలు జోరందుకోవడంతో ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఇందులో మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అధికారులు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. ఈ ఏడాది వన మహోత్సవంలో 18,02,673 మొక్కలు నాటనున్నారు.
మొక్కల సంరక్షణతోపాటు పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు 89.319 లక్షలు.. అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాకు 10.385 లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఈ సారి అత్యధికంగా మున్సి పల్ శాఖకు 8 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 7 కోట్ల మొక్కలు నాటే బాధ్యతను అప్పగించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 4.50 కోట్లు, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎస్ఎఫ్డీసీ), అటవీశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నారు.
ఒక విద్యార్థి.. ఒక మొక్క
వనమహోత్సవంలో విద్యార్థుల భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల విద్యార్థులను వనమహోత్సవంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ఒక విద్యార్థి.. ఒక మొక్క’ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యార్థులకు వన మహోత్సవంపై వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ వంటి పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను ‘గ్రీన్ అంబాసిడర్లు’గా ప్రోత్సహించనున్నారు.