నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తుల అటాచ్​: సీఎం రేవంత్

నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తుల అటాచ్​: సీఎం రేవంత్

నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుగాలం కష్టపడే రైతుల ఆత్మహత్యలకు నకిలీ విత్తనాలు కారణమవుతున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి.  కంపెనీ ఓనర్లను బాధ్యులను చేసినప్పుడే నకిలీ విత్తనాలకు అడ్డుకట్టపడుతుంది.  రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తన కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద జప్తు చేయాలి. అటాచ్​ చేయాలి. చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది” అని సీఎం రేవంత్​ అన్నారు. 

సమన్వయంతో సాగాలి

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే..  అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలని, జోడెద్దుల్లా ముందుకు సాగాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘ప్రజా ప్రతినిధులుగా మేము.. ప్రభుత్వ పథకాలు ముందు తీసుకెళ్లే వాళ్లుగా మీరు సమన్వయంతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా  ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది” అని అధికారులతో ఆయన అన్నారు.  ‘‘సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్లది, ఇంకో పక్కన పోలీస్ అధికారులది. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండేవాళ్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు,  పోలీస్ కమిషనర్లు. చివరి వరుసలో ఉన్నవాళ్లకు కూడా  సంక్షేమ పథకాలు చేరాలి. వారికి చేరవేయాల్సిన వారధి మీరే.  మీమీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత  పెడ్తున్నది” అని కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం సూచించారు.  ‘‘మానవీయ కోణంతో ప్రజలు లెవనెత్తిన అంశాలను అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపించలేం.  మనం ఈ కుర్చీలో కూర్చున్నది ప్రజల సమస్యలను పరిష్కంచడానికే అని గుర్తుంచుకోవాలి” అని చెప్పారు. ప్రజల మనసులను గెలుచుకోవాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు.