- కనీసం సెక్రటేరియట్‌లోకి రానివ్వలే
- కాంగ్రెస్ న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది
- సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్
- రేవంత్ పాలన భేష్ అంటూ పోస్టర్ల ఆవిష్కరణ
ముషీరాబాద్, వెలుగు: సింగరేణి భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగంటి రాములు అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాలన భేష్ అంటూ పోస్టర్లను ఆవిష్కరించారు. తర్వాత రాములు మాట్లాడుతూ.. 1991లో జీవో నెంబర్ 310 ప్రకారం1994లో సింగరేణి సంస్థ వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుందని, అయితే భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం భూమి విలువ చెల్లించాల్సిన నిబంధనలను అమలు చేయలేదన్నారు.
దీనిపై 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించామని 2013లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. అప్పటి బీఆర్ఎస్ సర్కారు తీర్పును అమలు చేయలేదని, కనీసం ఈ విషయంపై అడగడానికి వెళ్తే సెక్రటేరియట్ లోకి అడుగు పెట్టనీయలేదన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సెక్రటేరియట్‌లోకి వెళ్లి హైకోర్టు తీర్పుపై అధికారులతో మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ప్రభుత్వ హయాంలోనే హైకోర్టు ఆదేశాలు అమలవుతాయన్న నమ్మకం కలిగిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. అసోసియేషన్ ప్రతినిధులు పోతగంటి రవి, భూపాల్ పాల్గొన్నారు.
