
భగవంత్ మాన్‌కు పంజాబ్ సీఎం పీఠాన్ని తన భర్త బహుమతిగా ఇచ్చారని నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ అన్నారు. రాష్ట్ర పగ్గాలు సిద్ధూ చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరుకున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని మోసగించడం ఇష్టం లేక సిద్ధూ అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇటీవల భగవంత్ మాన్, సిద్ధూ మధ్య మాటల యద్దం క్రమంలో ఆమెఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
విజిలెన్స్ నిఘాలో ఉన్న ఓ పంజాబీ డెయిలీ పత్రిక ఎడిటర్‌కు మద్దతుగా ప్రతిపక్షాలు ఇటీవల జలంధర్‌లో సమావేశమయ్యాయి. దీంతో విపక్ష నేతలపై సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ విమర్శలు గుప్పించారు. దీనిపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిఘా వ్యవస్థగా మార్చిన వారు.. రిమోట్ కంట్రోల్‌కు పావుగా మారి రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు నైతిక విలువలపై ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటూ మండి పడ్డారు.
ఈ క్రమంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ట్విట్టర్ లో వరుస పోస్టులు పెట్టారు. "సీఎం భగవంత్ మాన్‌జీ.. మీకు సంబంధించిన ఓ రహస్యాన్ని ఇప్పుడు నేను బయటపెడుతున్నా. మీరు అధిష్ఠించిన సీఎం కుర్చీ.. సిద్ధూ మీకు బహుమతిగా ఇచ్చారని మీరు తెలుసుకోవాలి. పంజాబ్ పగ్గాలను సిద్ధూనే చేపట్టాలని ఒకప్పుడు కేజ్రీవాల్ కోరుకున్నారు. అందుకోసం పలు మార్గాల్లో ప్రయత్నించారు కూడా..కానీ, సిద్ధూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకోలేదు. ఆ అవకాశం మీకు కల్పించారు. ఆయన సత్యమార్గంలోనే నడవాలనుకుంటున్నారు. బంగారు పంజాబ్ ఆయన కల. అందుకోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు" అంటూ ఆమె రాసుకొచ్చారు.
పంజాబ్‌లో 2022 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఆప్ అఖండ విజయంతో అధికారంలోకి వచ్చి్ంది. దీంతో భగవంత్ మాన్ సీఎం అయ్యారు.