సీఎం షిండే అన్ని పార్టీలను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి : శరద్ పవార్

సీఎం షిండే అన్ని పార్టీలను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి : శరద్ పవార్

మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఈ వివాదంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు.  కర్ణాటకతో సరిహద్దు వివాదంపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న తరుణంలో ఎంపీలంతా ఒక్కతాటిపైకి వచ్చి..సరిహద్దు వివాదంపై తమ వాదనను వినిపించాలని పిలుపునిచ్చారు. 

సమస్యపై కర్ణాటక సీఎంతో సీఎం షిండే చర్చించినప్పటికీ.. ఆయన నుంచి ఎలాంటి సానుకూలత రాలేదని పవార్ అన్నారు. ఎవరూ తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఈ వివాదం ఆందోళనకర రీతిలో తీవ్రమవుతోందని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం వెతకాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉన్న విషయాన్ని పవార్ గుర్తు చేశారు.

వివాదం ఏంటీ..?

కర్నాటక, మహారాష్ట్రల మధ్య ఈ సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతమైన బెలగావిని పొరపాటున కర్నాటకలో చేర్చారని, అందువల్ల మళ్లీ ఆ ప్రాంతాన్ని మహారాష్ట్రలో చేర్చాలన్నది మహారాష్ట్ర వాదన. ఈ వాదనను తోసిపుచ్చుతున్న కర్నాటక.. నిజానికి మహారాష్ట్రలోని కొంత భాగం నిజానికి కర్నాటకకు చెందుతుందని కొత్త వాదన తెరపైకి తెచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.