దేశ చరిత్రలో తొలిసారి... జల్లికట్టు స్టేడియాన్ని ప్రారంభించిన సీఎం స్టాలిన్

 దేశ చరిత్రలో తొలిసారి... జల్లికట్టు స్టేడియాన్ని  ప్రారంభించిన సీఎం స్టాలిన్

జల్లికట్టు పోటీలకు తమిళనాడు రాష్ట్రం ప్రసిద్ధి. ఇక్కడ జల్లికట్టు పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తమిళులకు.. జల్లికట్టు అనేది సంప్రాదయ కీడ. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ వేళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించే జల్లికట్టు పోటీల్లో వందల మంది యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే, పోటీలకు ఇప్పటివరకూ ప్రత్యేక మైదానాలు అంటూ ఏమీ లేవు. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. జల్లికట్టు పోటీల కోసం ప్రత్యేక స్టేడియాన్ని నిర్మించారు. 

మధురై జిల్లా అలంగనల్లూరు సమీపంలోని కీలకరై  గ్రామంలో రూ.44 కోట్లతో స్టాలిన్ సర్కార్..   జల్లికట్టు స్టేడియాన్ని  నిర్మించింది. దీంతో జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా నిర్మించిన స్టేడియంగా ఇది నిలించింది.  ఈ జల్లికట్టు స్టేడియాన్ని జనవరి 24వ తేదీ బుధవారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. 5 వేల మందికి పైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే నేత ఎం కరుణానిధి పేరు పెట్టారు.

ఈ స్టేడియంలో వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో  నిర్మించిన ఈ మైదానంలో ఎద్దులతో పోటీపడి సత్తాచాటేందుకు యువ క్రీడాకారులు సిద్ధమయ్యారు.