ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ శుక్రవారం ( అక్టోబర్ 20)  విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు.

 మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. 

ALSO READ: Spiritual Dreams: దసరా నవరాత్రుల్లో మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా..

అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్ కు  మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులు కూడా స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.