కొత్త గనులు రాకపోతే సింగరేణి భవిష్యత్ కష్టం : సీఎండీ ఎన్.బలరాం నాయక్

కొత్త గనులు రాకపోతే సింగరేణి భవిష్యత్ కష్టం :  సీఎండీ ఎన్.బలరాం నాయక్

 

  • కేంద్ర ప్రభుత్వ వేలంలో పాల్గొని కొత్త మైన్స్ దక్కించుకోవాలి
  • పాన్​ ఇండియాగా మారిన సింగరేణి 
  • త్వరలో విదేశాల్లోనూ అడుగుపెడతాం
  • సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​

కోల్​బెల్ట్​,వెలుగు:  కొత్త గనులను తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని  సింగరేణి సీఎండీ ఎన్​.బలరాంనాయక్​అన్నారు. కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలంలో నేరుగా పాల్గొని కొత్త గనులను దక్కించుకుంటేనే భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి ఎంఎన్​ఆర్​గార్డెన్స్​లో 55వ సింగరేణి వార్షిక రక్షణ పక్షోత్సవాలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థాతో పాటు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో తెలంగాణకే పరిమితం కాలేదన్నారు.  ఇప్పటికే ఒడిశాలో బొగ్గు తవ్వకాలు చేపడుతుందన్నారు.  రాజస్థాన్​లో సోలార్​ప్లాంట్, కర్నాటకలో బంగారు, రాగి నిక్షేపాల అన్వేషణతో ఇలా దేశవ్యాప్తంగా విస్తరిస్తూ జాతీయ స్థాయిలో పాన్​ ఇండియా సంస్థగా మారిందన్నారు. త్వరలో విదేశాల్లో కూడా అడుగుపెడుతామని పేర్కొన్నారు. కార్మికులు దసరా,దీపావళి బోనస్​కోసం ఆందోళన చెందవద్దని, సరైన టైమ్​లో ఇస్తామన్నారు. మరో పది రోజుల్లో ఆఫీసర్ల పీఆర్​పీ సమస్యను తీర్చుతామని హామీ ఇచ్చారు. 

సంస్థకు నిర్దేశించిన 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే కొత్త బొగ్గుగను లు అవసరం ఉందన్నారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కన్నా కార్మికుల రక్షణకే ప్రయారిటీ ఇస్తున్నామన్నారు.  నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.  కొన్ని ఏరియాల్లో బొగ్గు గనులు మూసివేయడంతో సంస్థ మనుగడకు నష్టం జరుగుతుందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు రక్షణతో కూడిన టీమ్  వర్క్​ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతిభ చూపిన గనులు, డిపార్ట్​మెంట్లకు  బహుమతులు అందజేశారు. 

పదవీ విరమణ పొందిన సింగరేణి డైరెక్టర్​(ఈఎం) సత్యనారాయణ, జీఎం కో – ఆర్డినేషన్ సుభానిని సన్మానించారు. వేడుకల్లో డీడీఎంఎస్​ కన్నన్​, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతం పొట్రు, వెంకన్న జాదవ్​, కార్మిక నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్​కుమార్, జనక్​ప్రసాద్, సింగరేణి ఆఫీసర్ల సంఘం ప్రెసిడెంట్ లక్ష్మిపతిగౌడ్​, సింగరేణి సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్​, శ్రీరాంపూర్​ జీఎం శ్రీనివాస్​,డీజీఎంఎస్​ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.