
- దళితబంధులో రూ.3 లక్షలు తీసుకున్నారన్న కేసీఆర్ కామెంట్స్‌తో టెన్షన్
- డబ్బులు వసూలు చేసిన జాబితాలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు
- రూ.2 లక్షల నుంచి 3 లక్షల దాకా లంచం తీసుకున్నారనే ఆరోపణలు
- వాళ్లతో ఎన్నికలకెళ్తే నష్టమనే భావనలో బీఆర్ఎస్ హైకమాండ్
- అభ్యర్థులను మార్చేందుకే ఈ కామెంట్స్ చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్
- అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్
ఎన్నికల ముందు ప్రతిపక్షాల చేతికి అస్త్రం
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ చేసిన అవినీతి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారాయి. ప్రభుత్వ స్కీముల్లో లబ్ధిదారుల ఎంపికను నేరుగా ఎమ్మెల్యేలకే అప్పగించడం వల్ల భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, పైసలు ఇచ్చినవాళ్లకే పథకాలు అందుతున్నాయని బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల లీడర్లు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్‌తో ప్రతిపక్ష లీడర్లు ఒక్కసారిగా వాయిస్ పెంచారు. దళితబంధులో ఎమ్మెల్యేలు రూ.3 లక్షల చొప్పున తీసుకున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడాన్ని హైకోర్ట్ సూమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దళితబంధుతో పాటు వివిధ స్కీముల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఎంక్వైరీ చేయాలంటూ ఏసీబీకి బీజేపీ లేఖ రాసింది. ఆయా స్కీములపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. దళిత బంధులో రూ.1,000 కోట్ల కుంభకోణంపై ఏసీబీ సుమోటో గా కంప్లైంట్ స్వీకరించి విచారణ చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
వరంగల్/నెట్‌వర్క్, వెలుగు: ‘‘ఎమ్మెల్యేలు ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. దళితబంధు ఇవ్వడానికి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అందరి చిట్టా నా దగ్గర ఉంది. అవినీతికి పాల్పడేటోళ్ల తోకలు కట్ చేస్తా. వాళ్లు ఇకపై పార్టీలో కూడా ఉండరు” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ముందు ఆయా ఎమ్మెల్యేల్లో బుగులు మొదలైంది. తమకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఉంటుందో, ఊడుతుందోనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. దళితబంధు లబ్ధిదారుల నుంచి సుమారు 20 మంది దాకా ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు.. రూ.2 లక్షల నుంచి3 లక్షల దాకా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. లీడర్ల వసూళ్ల దందాను తట్టుకోలేక లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దళితబంధులో ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు లక్షలకు లక్షలు కమీషన్లు వసూలు చేస్తున్నారని, పలుచోట్ల యూనిట్లకు అర్రాస్పెడ్తున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. దళితబంధుతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు, గొర్రెల పంపిణీ స్కీమ్, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ తదితరాల్లో పైసలు గుంజుతున్నారని అప్పట్లో సర్కారుకు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ రిపోర్టులు అందాయి.
లబ్ధిదారుల ఎంపికకు సర్కారు ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించకుండా, ఎంపిక బాధ్యతలను ఆఫీసర్లకు కాకుండా ఎమ్మెల్యేలకే అప్పగించడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడిందనే విమర్శలు వచ్చాయి. కానీ ఏనాడూ ఎవరిపైనా, ఎలాంటి చర్యలు తీసుకోని సీఎం కేసీఆర్.. అకస్మాత్తుగా ఈ అంశాన్ని ఆయనే ఎందుకు తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతున్నది. తీవ్ర వ్యతిరేకత ఉన్న చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే గెలుపు కష్టమేనని ఇటీవల సర్కారు చేయించిన సర్వేల్లో తేలింది. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్తే నష్టమని భావిస్తున్న కేసీఆర్.. ఆయా చోట్ల అభ్యర్థులను మార్చేందుకే ఈ కామెంట్స్చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ చేసిన అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు వసూలు చేసిన జాబితాలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులు దళితబంధు లబ్ధిదారుల నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేయించారని అప్పట్లో సర్కారుకు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలపైనా ఇలాంటి రిపోర్టులే ప్రభుత్వానికి అందాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అనుచరులు యూనిట్‌కు రూ.2 లక్షల చొప్పున, నర్సంపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేల అనుచరులు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండలం రామతీర్థం (అర్సనపల్లి) గ్రామానికి 12 యూనిట్లు మంజూరు కాగా, ఎమ్మెల్యే అనుచరులు రూ.లక్ష చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ గోపి విచారణకు ఆదేశించారు. కానీ లోకల్ ఎమ్మెల్యే కలుగజేసుకుని 12 యూనిట్లను 22 మందికి పంపిణీ చేశారు. ఒకరి పేరుతో వాహనం ఇచ్చి.. ఇద్దరికి హక్కు ఉన్నట్లు తెరవెనుక లోకల్ లీడర్లతో బాండ్ పేపర్లు రాయించారు. ఇది కాస్తా లబ్ధిదారుల నడుమ గొడవలకు దారి తీసి, ఆ పంచాయితీలు పోలీస్‌స్టేషన్‌దాకా వెళ్లాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అనుచరులు దళితబంధు కోసం పైసలు వసూలు చేశారని ఆరోపిస్తూ ఖానాపూర్ మండలం తర్లపాడు దళితులు ఆందోళన నిర్వహించారు. ఇదే జిల్లా సారంగాపూర్ మండలం గోడిసెర, వంజర్ గ్రామాల్లో దళితబంధు యూనిట్ల కోసం వేలంపాట నిర్వహించడం అప్పట్లో కలకలం రేపింది. వంజర్ గ్రామంలో మూడు దళిత బంధు యూనిట్లు మంజూరుకాగా, రెండు యూనిట్లకు రూ.3 లక్షల చొప్పున, మూడో యూనిట్‌ను రూ.4 లక్షలకు పాట పాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనుచరులు ఒక్కో యూనిట్‌కు రూ.లక్ష దాకా.. నిజామాబాద్ జిల్లాలో అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేల అనుచరులు రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా వసూలు చేశారేనే ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, వైరా ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వినిపించాయి.
ప్రధానంగా వైరా ఎమ్మెల్యే అనుచరులు కొన్ని ఊళ్లలో అర్రాస్ పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయడం అప్పట్లో సంచలనమైంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి పంచాయతీ పరిధిలోని నడిమూరులో వేలం పాటలో రూ.3.30 లక్షలు ఇచ్చిన వ్యక్తిని దళితబంధు లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. స్కీమ్ మంజూరయ్యాక రూ.2 లక్షలు ఇచ్చేలా ఎమ్మెల్యే అనుచరులు లబ్ధిదారులతో బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్న దాఖలాలున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు.. లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి దళితబంధు ట్రాక్టర్ ఇప్పించి, రూ.2 లక్షలు ఇవ్వాలని అగ్రిమెంట్చేసుకున్నాడు. లబ్ధిదారుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్ బాడీని తీసుకెళ్లడంతో విషయం బయటకు వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర ఎమ్మెల్యే దగ్గర పని చేస్తున్న కొందరు బీఆర్ఎస్ లీడర్లు దళిత బంధు స్కీమ్ ఇప్పిస్తామని లబ్ధిదారుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో దళితబంధు ఇప్పిస్తామని ముందస్తు అగ్రిమెంట్లు చేసుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ల వసూళ్లకు నిరసనగా కోహెడ, అక్కన్నపేట మండలాల్లో దళితులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు.