న్యూఢిల్లీ: వెహికల్స్‌లో వాడే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇండియాలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం తక్కువ రేటుకే సప్లయ్ చేస్తోంది. తాజాగా ఈ సప్లయ్‌ను 20 శాతం తగ్గించింది. దీంతో సీఎన్‌జీ ధరలు కేజీపై రూ.4–6 వరకు పెరిగే ఛాన్స్ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే రేట్లు పెరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం కేజీ సీఎన్‌జీ ధర రూ.92 ఉంటే, ఇందులో రూ.14–-15 వరకు ఎక్సైజ్ డ్యూటీ వాటా ఉంది.
ఇండియాలో అరేబియన్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్ వంటి ఏరియాల్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. దీన్ని సీఎన్‌జీ, వంట గ్యాస్ అయిన పీఎన్‌జీగా మార్చి అమ్ముతున్నారు. గత ఏడాది కాలంలో గ్యాస్ ఉత్పత్తి 5 శాతం మేర తగ్గిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. అందుకే గ్యాస్ అమ్మే సంస్థలకు ప్రభుత్వం సప్లయ్ తగ్గించిందని పేర్కొన్నారు. మరోవైపు వంట గ్యాస్ పీఎన్‌జీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చు. పీఎన్‌జీ అవసరాల కోసం ప్రభుత్వం గ్యాస్ సప్లయ్‌ను తగ్గించలేదు. డిమాండ్ తగ్గ నేచురల్ గ్యాస్ సప్లయ్ కాకపోవడంతో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ని ఎక్కువ ధరకు దిగుమతి చేసుకోవలసి వస్తోంది.