- పది ఏరియాల్లో మూడు చోట్లనే బొగ్గు క్వాలిటీ
- నాణ్యతలో కీలకమైన కోల్వాషరీల జాడే లేదు
- 25 ఏండ్లుగా బొగ్గు నాణ్యత వారోత్సవాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో 25 ఏండ్లుగా బొగ్గు నాణ్యత వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. కానీ, ఆచరణలో ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. సింగరేణివ్యాప్తంగా పది ఏరియాల్లో కేవలం మూడు ప్రాంతాల్లోనే క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అది కూడా.. కంపెనీలతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ మేరకు నాణ్యమైన గ్రేడ్బొగ్గును సరఫరా చేయడంలేదు. సింగరేణివ్యాప్తంగా పరిశీలిస్తే 56.55 శాతానికి క్వాలిటీ బొగ్గు ట్రాన్స్‌పోర్టు అవుతుండడం గమనార్హం.
పది ఏరియాల్లో ఏ ఒక్క ఏరియా కూడా కనీసం 80శాతంతో క్వాలిటీ బొగ్గు అందించడంలేదు. మరోవైపు రూ. కోట్లలో ఫైన్లు కడుతోంది. దీంతో కంపెనీపై ఆర్థిక భారం పడుతోంది. కోల్వాషరీల ఏర్పాటు జాడే లేదు. కాగా.. సింగరేణి బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఈనెల 13 నుంచి 19 వరకు ఆర్భాటంగా చేసిందే తప్ప ఆచరణలో ఫెయిల్అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో వందశాతం నాణ్యత ప్రకటనలకే పరిమితమైంది.
బొగ్గు గ్రేడ్ ఇలా..
కేంద్ర బొగ్గు గనుల శాఖ బొగ్గును జి–1 గ్రేడ్‌నుంచి జి –17 వరకు విభజించింది. ఇందులో సింగరేణిలో ఎక్కువగా జి–5 గ్రేడ్‌నుంచి జి –15గ్రేడ్ లు లభిస్తున్నాయి. మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అవుతోంది. మిగిలిన ఏరియాల్లో పలు రకాల గ్రేడ్ ల్లో ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తికి కంపెనీలకు జి–17 గ్రేడ్బొగ్గు ధర టన్ను రూ. 1,230 ఉండగా, జి–5 బొగ్గు ధర టన్నుకు 5,385వరకు పలుకుతోంది. నాన్పవర్కంపెనీలకు జి –17 బొగ్గు టన్ను ధర రూ. 1,580 ఉండగా, జి–5 ,385గా ధర ఉంది.
నాణ్యత పరిశీలించేందుకు..
సింగరేణిలో లభించే బొగ్గు నాణ్యతను పరిశీలించేందుకు ఐదు ఏజెన్సీలో ఉన్నాయి. థర్ట్‌పార్టీ పేరుతో వివిధ పరిశ్రమలు, థర్మల్పవర్స్టేషన్లకు ట్రాన్స్‌పోర్టు అవుతున్న బొగ్గు నాణ్యతను పరీక్షించి, ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇస్తుంటాయి. అగ్రిమెంట్ మేరకు గ్రేడ్బొగ్గు సప్లై చేయకపోతే ఫైన్పడుతుంది.
కానరాని కోల్వాషరీలు
బొగ్గు నాణ్యతలో కీలకమైన కోల్వాషరీలు సింగరేణిలో కానరావడం లేదు. గతంలో మణుగూరు, ఆర్జీ–2తో పాటు ఆర్కేపీలో కోల్వాషరీలుండేవి. మరికొన్ని ఏర్పాటు చేస్తామని యాజమాన్యం తెలిపింది. కానీ.. ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
ప్రస్తుత పోటీ మార్కెట్‌ను తట్టుకుని..
ప్రస్తుతం పోటీ మార్కెట్లో కంపెనీలు అడిగిన విధంగా బొగ్గు ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ బొగ్గు దిగుమతితో బొగ్గు ధరలు తగ్గుతుండడం సింగరేణి ఇబ్బందిగా మారింది. వినియోగదారులు అడిగిన గ్రేడ్మేరకు బొగ్గును ట్రాన్స్‌పోర్టు చేయాలి. అయితే.. అగ్రిమెంట్ మేరకు బొగ్గు సప్లై చేయలేక రూ. కోట్లలో సింగరేణి ఫైన్కట్టాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు అడిగిన గ్రేడ్ బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేయకపోతుండడంతో ఆర్థికంగా నష్టం వస్తుందని ఇటీవల బీటీపీఎస్, కేటీపీఎస్సంస్థలు పలుమార్లు పేర్కొన్నాయి.
మూడు ఏరియాల్లోనే బెస్ట్ క్వాలిటీ
సింగరేణిలో శ్రీరాంపూర్, ఆర్జీ–2, మందమర్రి ఏరియాలు మాత్రమే బొగ్గు నాణ్యతలో బెస్ట్‌గా నిలిచా యి. ప్రతి ఏటా ఏరియాల వారీగా బొగ్గు నాణ్యతను యాజమాన్యం పరిశీలిస్తోంది. ఇక క్వాలిటీ లో13 శాతంతో ఆర్జీ –1 ఏరియా చివరన నిలిచింది. ఏటా నాణ్యతా వారోత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ ఆచరణలో సింగరేణి కృషి చేయడంలేదు. 80 శాతం కూడా క్వాలిటీ సాధించడంలేదు.
ఏరియాల వారీగా క్వాలిటీ బొగ్గు వివరాలు
ఏరియా నాణ్యత గ్రేడ్(శాతం)
శ్రీరాంపూర్ 75.17
ఆర్జీ–2 73.41
మందమర్రి 71.33
ఇల్లెందు 70.19
భూపాలపల్లి 68.11
బెల్లంపల్లి 64.18
ఆర్జీ–3 63.35
మణుగూరు 51.34
కొత్తగూడెం 47.16
ఆర్జీ –1 13.00
మొత్తం 56.55
