రోజురోజుకు పెరుగుతున్న చలి .. సిర్పూర్​లో 6.6 డిగ్రీలు

రోజురోజుకు పెరుగుతున్న చలి ..  సిర్పూర్​లో 6.6 డిగ్రీలు

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్​లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​లోని జైనథ్​లో 7.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. సంగారెడ్డిలోని కోహిర్​లో 8.6 డిగ్రీలు, సిద్దిపేటలోని కొండపాకలో 8.6 డిగ్రీలు, నిర్మల్​లోని పెంబిలో 8.7 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లిలోని ముత్తారం మహదేవ్​పూర్​లో 9.3 డిగ్రీలు, జగిత్యాలలోని గుళ్లకోటలో 9.4 డిగ్రీలు, హనుమకొండలోని ఎల్కతుర్తిలో 9.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వరంగల్​లోని దుగ్గొండిలో 9.5 డిగ్రీలు, వికారాబాద్​లోని మర్పల్లిలో 9.6 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేటలో 9.6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలోని రెడ్డిపల్లిలో 9.7 డిగ్రీలు, కామారెడ్డిలోని బీబీపేటలో 9.8 డిగ్రీలు, మెదక్​ జిల్లాలోని దామరంచలో 9.8 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డైంది. అదేవిధంగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాముకుంటలో 9.8 డిగ్రీలు, మంచిర్యాలలోని జైపూర్​లో 10 డిగ్రీలు, ములుగులోని తాడ్వాయి హట్స్​లో 10 డిగ్రీలు, పెద్దపల్లిలోని జూలపల్లిలో 10 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలోని చింతకుంటల్లో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్​లోనే ఉష్ణోగ్రతలు

ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఇక్కడి అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్​లోనే టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇటు హైదరాబాద్​లో అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బీహెచ్​ఈఎల్ ఫ్యాక్టరీ పరిధిలో ఆ టెంపరేచర్ నమోదైంది. మూడు రోజుల పాటు చలి తీవ్రత ఉన్నా.. టెంపరేచర్లు కాస్తంత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలంగాణ స్టేట్ డెవలప్​మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్టులో వెల్లడైంది. కాగా, ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ఎఫెక్ట్​ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఉదయం నుంచి రాత్రి దాకా వీస్తున్న చలి గాలులతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండడంతో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇన్ఫెక్షన్ల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.