కన్నుమూసిన సూపర్ మామ్

కన్నుమూసిన సూపర్ మామ్

మధ్యప్రదేశ్: జీవితకాలంలో అత్యధికంగా పిల్లలకు జన్మనిచ్చిన పులి కాలర్వాలీ కన్నుమూసింది. వయోభారం కారణంగా 17ఏళ్ల వయసులో మృత్యువాత పడింది. సాధారణంగా పులులు 10 నుంచి 12 ఏళ్లు మాత్రమే బతుకుతాయి. కానీ కాలర్వాలీ మాత్రం 17ఏళ్లు బ్రతకడం విశేషం. 2005లో టీ 5 పులికి జన్మించిన ఈ పులి తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో నాలుగు మినహా మిలిగినవన్నీ బతికాయి. అన్ని కూనలకు జన్మనిచ్చిన కారణంగానే ఫారెస్ట్ అధికారులు దాన్ని సూపర్ మామ్, క్వీన్ ఆఫ్ పెంచ్ అని కూడా పిలిచేవారు. వయసు పైబడటంతో గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాలర్వాలీ మృత్యువాతపడటంతో ఫారెస్ట్ అధికారులు దాన్ని ఘనంగా సాగనంపారు. దాని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. సూపర్ మామ్ మృతిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తంచేశారు. 

పెంచ్ టైగర్ రిజర్వ్లో 2008లో తొలి రేడియో కాలర్ను ఈ పులికి అమర్చడంతో దానికి కాలర్వాలీ అని పేరు వచ్చింది. ఈ పులికి 2008లో తొలిసారి మూడు పిల్లలు పుట్టగా.. 2018లో చివరిసారిగా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. 2010లో ఒకేసారి ఐదు కూనలకు జన్మనిచ్చిన ఘనత కాలర్ వాలీ సొంతం. ఇప్పటి వరకు ఏ పులి కూడా తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనివ్వలేదని ఫారెస్ట్ అధికారులు చెప్పారు.