
నిర్మల్/ఆసిఫాబాద్/నస్పూర్/ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నిర్మల్కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్ని సందర్శించాలని ఆదేశించారు.
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరిచేయాలని, తమ గ్రామంలోని చాలా మంది వృద్ధులకు పింఛన్ రావడం లేదని జైనూర్ మండలం బుషిమెట్ట క్యాంపు గ్రామస్తులు, అక్రమ పట్టాను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని, రెబ్బెన మండలం కొండపల్లిలో రోడ్డుకు రిపేర్లు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, వితంతు ఫించన్ ఇప్పించాలని ప్రజలు అర్జీ సమర్పించారు.
దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తన భర్త తాను దివ్యాంగులమని డబుల్బెడ్రూం ఇల్లు ఇప్పించాలని మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్‌కు చెందిన ఆసంపల్లి చంద్రకళ దరఖాస్తులు అందించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు ఉండ్రాల ఎల్లయ్య కోరారు.
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా అన్నారు. కలెక్టరేట్మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి 68 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీవో స్రవంతి, ఏవో వర్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.