
నిర్మల్/నస్పూర్, వెలుగు: క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళ వారం సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మారుతున్న జీవనశైలి కారణంగా సమాజంలో క్యాన్సర్ వ్యాధి తీవ్ర రూపం దాలుస్తోందన్నారు. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం, ఈ వ్యాధితో పోరాడుతున్న వారిని ప్రోత్సహించడం ఎంతో అవసరమన్నారు. నిరంతర వ్యాయామం, ఆరోగ్యకర జీవన శైలి, మెరుగైన ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల క్యాన్సర్ దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చన్నారు. క్యాన్సర్ వ్యాధికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, సరైన చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, డాక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి స్టేజ్ లోనే కనుక్కుంటే నివారణకు అవకాశం
ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని శ్రీరాంపూర్ జీఎంఎస్వీ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం సీసీసీలోనని ఎస్సీవోఏ క్లబ్లో డీవైసీఎంవో డాక్టర్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, నివారణ చర్యలపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణలో ఏరియా వైద్య అధికారులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని అన్నారు. క్యాన్సర్‌ను మొదటి స్టేజిలోనే కనుక్కుంటే నివారణ కష్టం కాదన్నారు. సేవ అధ్యక్షురాలు మాలతి, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు బాజీ సైదా, ఇంచార్జ్ డీజీఎం(పి) రాజేశ్వర్, డీవైసీఎంవో డాక్టర్ ప్రసన్న కుమార్, సీనియర్ పీవో కాంతారావు తదితరులు పాల్గొన్నారు.