
నిర్మల్, వెలుగు: జిల్లాలో సీఎంఆర్ ప్రక్రియను స్పీడప్ చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో సంబంధిత అధికా రులు, రైస్ మిల్లర్లతో ఆమె రివ్యూ నిర్వహించారు. సీఎంఆర్ సరఫరాకు సంబంధించి ప్రతి మిల్లర్ గడువులోపు లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఇక నుంచి రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే నిబంధనలకు లోబడి ప్రభుత్వానికి అందజేస్తామన్న ఒప్పందం చేసుకుంటేనే కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచి మిల్లింగ్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
మిల్లర్లకు నిర్ధేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సరఫరా చేసిన సీఎంఆర్, మిగిలిన ధాన్యం, రోజువారీగా తరలిస్తున్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు మిల్లుల్లో ధాన్యం నిల్వ, సామర్థ్యం, అన్‌లోడింగ్ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం సుధాకర్, ఎల్డీఎం రాంగోపాల్, పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.