
వనపర్తి, వెలుగు: జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ప్రాజెక్టుల భూసేకరణపై ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణప సముద్రంకు సంబంధించి 18 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగిందని, మిగిలిన భూసేకరణ కోసం పట్టాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
గోపాల్పేట మండలం బుద్ధారం రిజర్వాయర్‌కు సంబంధించి సబ్ డివిజనల్ రికార్డు, ఎంజాయ్మెంట్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు. బీమా ప్రాజెక్టుకు సంబంధించిన 26 ఎకరాలను వేగంగా సేకరణ చేయాలన్నారు. ఇరిగేషన్ ఈఈ మధు, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మెడికల్ రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్, అడిషనల్ కలెక్టర్ యాదయ్య, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, డాక్టర్లు శ్రీనివాస్, చిన్నమ్మ థామస్ పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్యపెంచాలి
పెబ్బేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మండలంలోని అయ్యవారిపల్లె జడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగాలే తప్ప తగ్గవద్దన్నారు. ఏఐ ద్వారా విద్యార్థులకు చదువు నేర్పించేందుకు ఏర్పాటు చేసిన క్లాస్ రూమ్‌ను సందర్శించారు. తహసీల్దార్ మురళి, ఎంఈవో జయరాములు, మహానంది ఉన్నారు.