
పెద్దమందడి, వెలుగు: పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. గర్భిణులు, ప్రసవాల నమోదు, రక్త పరీక్షల రిజిస్టర్లను పరిశీలించారు. జులై నెలలో ఒకే ఒక డెలివరీ జరిగినట్లు తెలుసుకొని, కలెక్టర్ ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జ్వరం, దగ్గు, ఒళ్లనొప్పులతో వచ్చేవారికి తప్పకుండా రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పకడ్బందీగా నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా డెంగ్యూ కేసులు నమోదైతే వెంటనే సోర్స్ గుర్తించి, తొలగించాలని చెప్పారు. బాధితుల చుట్టుపక్కల ఉంటున్నవారి రక్త నమూనాలు తీసుకొని, పరీక్షలు చేయాలన్నారు. కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.