సేంద్రియ ఎరువులతో భూమికి సారం : కలెక్టర్ ​ఆదర్శ్​ సురభి

సేంద్రియ ఎరువులతో భూమికి సారం : కలెక్టర్ ​ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భావి తరాలకు భూమిని కాపాడిన వారవుతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భూసారం తగ్గిందని ఏటా డీఏపీ, యూరియా వంటి  రసాయనిక  ఎరువులు వాడుతూ పోతే భూమి పనికిరాకుండా పోతుందన్నారు. పంట వేసే 45 రోజుల ముందు జీలుగ పచ్చ రొట్ట, పెసర, జనుము వంటి పంటలు సాగు చేసి వాటిని భూమిలో దున్నడం వల్ల మంచి సేంద్రియ ఎరువుగా మారుతుందని తెలిపారు. పశువుల ఎరువు వాడడం వల్ల అధిక దిగుబడి రావడమే కాకుండా భూమి సారవంతంగా మారుతుందన్నారు.

రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఆన్లైన్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు రైతులకు తెగుళ్ల నివారణపై సలహాలు, సూచనలు ఇస్తున్నారని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు ఆలోచించాలని సూచించారు. పంట చేతికి వచ్చే వరకు రైతులకు అంతరపంట సాయం కింద ఎకరాకు రూ.4 వేల సాయం అందుతున్నారు.  జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి రైతు పచ్చరొట్ట, పెసర, జీలుగా పంటలు తప్పనిసరిగా సాగు చేయాలన్నారు. హార్టికల్చర్​ఆఫీసర్​ విజయ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

లారీలను వెంటనే పంపాలి

 రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకొని లారీలను వెంటనే  పంపించాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు.  మంగళవారం రాజనగరం వరి కొనుగోలు కేంద్రాన్ని, చిట్యాల వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించారు. అకాల వర్షాలు పడుతున్నందున  రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడే అవకాశముందని, అందువల్ల మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను దించుకొని వెంటనే తిరిగి పంపాలని మిల్లర్లకు సూచించారు.  వెంకటేశ్వర మిల్లు లో ధాన్యం నిల్వలను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఎస్​వో విశ్వనాథ్​ ఉన్నారు.