ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఈఈకి షోకాజ్​ నోటీస్​ ఇవ్వాలని ఆదేశం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పబ్లిక్​ హెల్త్​ ఇంజనీరింగ్​ ఆఫీసర్లపై కలెక్టర్​ అనుదీప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్​లో పట్టణ ప్రగతి పనులు, ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు, క్రిమిటోరియాల​ వర్క్స్​పై బుధవారం కలెక్టర్​ రివ్యూ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్​, క్రిమిటోరియల్​ నిర్మాణ పనులు స్లోగా నడుస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈకి షోకాజ్​ నోటీస్​ ఇవ్వాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు భవిష్యత్తులో పనులు చేపట్టకుండా బ్లాక్​ లిస్ట్​లో పెట్టేలా నివేదికలు ఇవ్వాలని పబ్లిక్​ హెల్త్ ఇంజనీరింగ్​ ఆఫీసర్లకు సూచించారు. పనుల ప్రాధాన్యతను ఎందుకు గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించి వేరే వాళ్లతో పనులు చేయించాలన్నారు. నిర్లక్ష్యం  చేయడంతోనే పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినప్పుడు పనులు చేస్తామంటే కుదరదని అన్నారు. నవంబర్​ నెల చివరి వరకు ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు, క్రిమిటోరియాల​ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో బాస్కెట్​బాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్​ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. మణుగూరు మెగా పార్కు నిర్వహణ సక్రమంగా లేదన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీని పిగ్​ ఫ్రీగా ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్త్రీనిధి రుణాల రికవరీపై సమీక్షించారు. కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల కమిషనర్లు నవీన్​కుమార్, శ్రీకాంత్, అంకుషావళి, మాధవి పాల్గొన్నారు. 

మధిరలో టీఆర్ఎస్​ జెండా ఎగరాలి

ముదిగొండ, వెలుగు: మధిర నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లింగాల కమల్​రాజును ఈ సారి గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కోరారు. మండలలోని ఖానాపురం రూ.20 లక్షల రాష్ట్రీయ గ్రామ స్వరాజ్  నిధులతో  నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు.  వారికి గ్రామస్తులు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కార్యకర్తలకు కష్టం వస్తే కాపాడుకోవాల్సిన బాధ్యతను పార్టీ మరవదని అన్నారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మాధాపురం, పండ్రేగుపల్లి గ్రామాలకు చెందిన టీఆర్ఏస్ కార్యకర్తలు చనిపోవడంతో వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున ఇన్సూరెన్స్​ చెక్కులను అందజేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, సర్పంచ్  మాలోజు ఉషా గోవిందు, ఎంపీటీసీ నానబాల మాధవి, వాచేపల్లి లక్ష్మారెడ్డి, పసుపులేటి వెంకట్, పోట్ల ప్రసాద్, పాము సిల్వరాజ తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్  నిర్మాణ పనుల పరిశీలన

ఖమ్మం కార్పొరేషన్: సిటీలో నిర్మిస్తున్న కలెక్టరేట్  బిల్డింగ్​ నిర్మాణ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్  లింగాల కమల్ రాజు, మున్సిపల్  కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆదివాసీలకు అండగా ఉంటాం

మణుగూరు, వెలుగు: ఆదివాసీలకు అండగా ఉంటామని ఎస్పీ డా. వినీత్​ చెప్పారు. మండలంలోని మారుమూల గొత్తికోయ గ్రామమైన బుడుగులలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు ఎస్పీ స్వయంగా బూస్టర్ డోస్  టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే పోలీసు ఆఫీసర్లు మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. బుడుగుల గ్రామానికి అవసరమైన సౌలతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్తులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు అందించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మణుగూరు సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి.సాయి మనోహర్, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, ఏడూళ్ల బయ్యారం సీఐ రాజ గోపాల్, మణుగూరు సీఐ ముత్యం రమేశ్, అశ్వాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సైలు టీవీఆర్ సూరి, రాజ్ కుమార్  పాల్గొన్నారు. 

భద్రాచలం ఆలయ ఈఈగా రవీందర్​రాజు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఈగా రవీందర్​రాజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈవో శివాజీ బుధవారం ఆర్డర్స్ ఇచ్చారు. ప్రస్తుతం డీఈగా రవీందర్​రాజు విధులు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఏడాది రామాలయంలో పుష్కర పట్టాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు దేవస్థానం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. యాదగిరిగుట్ట ఈఈ దయాకర్​రెడ్డి భద్రాచలం దేవస్థానానికి ఇన్​చార్జీగా  వ్యవహరిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.

‘పాలేరులో పోటీ చేస్తా’

ఖమ్మం రూరల్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని సాయిగణేశ్​నగర్​లో మీడియాతో మాట్లాడుతూ 2018 ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్టానం తన పేరును పరిశీలించిందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మామిడి వెంకన్న, షేక్ హుస్సేన్, సంధ్యారెడ్డి, రామకృష్ణ గౌడ్, తేజావత్  శివాజీ, నాగండ్ల శ్రీనివాస్​రావు, వెళ్తూరి వెంకటేశ్​ పాల్గొన్నారు.

‘రికార్డులు సక్రమంగా ఎందుకు ఉండవ్’

ముదిగొండ, వెలుగు: ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన రికార్డులను ఎందుకు నిర్వహించడం లేదని అడిషనల్ కలెక్టర్ స్నేహలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని సువర్ణాపురం, ముదిగొండ గ్రామ పంచాయతీలను ఆమె తనిఖీ చేశారు. సువర్ణాపురం జీపీలో ఉపాధి హామీ రికార్డులను పరిశీలించి సక్రమంగా లేకపోవడంతో కార్యదర్శి హరి, ఏపీవో అజయ్ కుమార్,  టెక్నికల్ అసిస్టెంట్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు కూడా రాయడం రాదా అంటూ మండిపడ్డారు. మరోసారి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని అన్నారు. డీఆర్డీవో  విద్యచందన, డీపీవో హరిప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్ రావు ఉన్నారు. 

కేటీపీఎస్​లో నిర్వాసితులకు ఉపాధి కల్పించండి

పాల్వంచ,వెలుగు: కేటీపీఎస్ లో 12 మందికి ఉపాధి కల్పించి మిగిలిన ఆరుగురిని పట్టించుకోకపోవడం సరైంది కాదని భూ నిర్వాసితులు తెలిపారు. బుధవారం బాధిత నిర్వాసితులు తమకు ఉపాధి కల్పించాలని తహసీల్దార్  రంగాప్రసాద్ కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బాధితులు గుగులోత్ విజయ్, గోపి, బానోత్​ రవి, ఇస్లావత్ కుమార్, ధర్మసోత్  హరి, జర్పల హరి పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అశ్వారావుపేట, వెలుగు: బైక్​ను ట్యాంకర్  ఢీకొనడంతో పట్టణంలోని ఫైర్ కాలనీకి చెందిన పిప్పళ్ల వెంకట రామ్ తేజ(18) చనిపోగా, పిప్పళ్ల ఫణికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి రామ్​తేజ, ఫణి బైక్​పై వెళ్తుండగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్యాంకర్  ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రామ్ తేజ అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాల పాలైన ఫణిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గజలక్ష్మిగా లక్ష్మీతాయారు అమ్మవారు

భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం లక్ష్మీతాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ముందుగా అమ్మ మూలవరులకు తిరుమంజనం చేశారు. ఉత్సవమూర్తిని గజలక్ష్మిగా అలంకరించి భక్తుల దర్శనార్ధం ఉంచారు. కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన జరిగాయి. ఉదయం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత స్నపన తిరుమంజనం చేశారు.చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణ అయోధ్యకాండ పారాయణం జరిగింది. 

గాయత్రీదేవిగా పెద్దమ్మతల్లి.. 

పాల్వంచ: మండలంలోని పెద్దమ్మతల్లికి బుధవారం 21 మంది చిన్నారులచే బాల పూజ నిర్వహించారు. అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు.  కుంకుమ పూజ జరిపించారు. 

పోలీస్  కాన్ఫరెన్స్  హాల్  ప్రారంభం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కొత్తగా నిర్మించిన పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్, కలెక్టర్  వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్  వారియర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత  పోలీస్‌శాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మిస్తుందని చెప్పారు. పోలీస్‌ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కాన్ఫరెన్స్ హాల్ నిర్మించినట్లు తెలిపారు. సీపీ మాట్లాడుతూ నేర సమీక్ష సమావేశాలు, ఫంక్షన్​హాల్, శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం కాన్ఫరెన్స్ హాల్  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శబరీష్, సుభాష్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు రామోజీ రమేశ్, ఆంజజనేయులు,  భస్వారెడ్డి పాల్గొన్నారు.

గుండాలలో బతుకమ్మ వేడుక

గుండాల, వెలుగు: మండలంలో బుధవారం బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రథసారథి ప్రజా గాయని విమలక్క హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాలవాడ, మాదిగవాడ వేర్వేరుగా కాకుండా ఊరంతా ఒక్కటిగా పిలిచిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని అన్నారు. బహుజనుల పండుగ బతుకమ్మకు దళితులు ఇంతకాలం దూరం చేశారని చెప్పారు. గుండాల మండలంలో పోడు సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. అనంతరం పెట్రోల్  బంక్  నుంచి బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించి, మహిళలతో బతుకమ్మ ఆడి పాడారు. రాష్ట్ర కార్యదర్శి మన్సూర్, పీవోడబ్ల్యూ నాయకురాలు పద్మ ,అరుణ, గంగ, రమణ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలి

పాల్వంచ, వెలుగు: టీఆర్ఎస్  పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్కామ్ లలో కూరుకుపోయిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కిన్నెరసాని, యానంబైల్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎడవల్లి కృష్ణను పార్టీ నాయకులు సన్మానించారు. నూకల రంగారావు, కాలం శ్రీను, సురేశ్, కృష్ణ, కట్టా సోమయ్య, బుడగం కిరణ్, రాజు, ప్రశాంత్, రాములు నాయక్, బాలు నాయక్, నాగయ్య, వీరబాబు, రాంబాబు, రాము నాయక్, చంద్రగిరి సత్యనారాయణ పాల్గొన్నారు. 

షోరూమ్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సత్తుపల్లి, వెలుగు: పట్టణంలో ఏర్పాటు చేసిన క్రాంతి శారీస్ అండ్ బోటిక్ షోరూమ్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన సతీమణి మహాలక్ష్మీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఇతర పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా షోరూమ్​ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రాంతి శారీస్​ను ఆదరించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఏసీపీ వెంకటేశ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు దూదిపాల రాంబాబు, మట్ట ప్రసాద్, లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పెద్దిరాజు, షోరూమ్  నిర్వాహకులు వీరపనేని రాధిక బాబి, క్రాంతి, చైతన్య, కోనేరు నాని, నాయకులు యాగంటి శ్రీను, పాల వెంకటరెడ్డి, వల్లభనేని పవన్ పాల్గొన్నారు.

గిరిజనులు, ఫారెస్ట్  ఆఫీసర్ల మధ్య ఘర్షణ

సత్తుపల్లి, వెలుగు: పట్టణం సమీపంలోని గుడిపాడు ప్రాంతంలో పోడుభూమి సాగు చేసుకోకుండా గిరిజనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. 25 ఎకరాల పోడు భూముల్లో మంగళవారం జీడి మొక్కలు పెట్టుకుంటుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు ఆందోళనకు దిగారు. వీరికి సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా నాయకులు బాసటగా నిలిచారు. రెండో రోజు ఘర్షణ జరగడంతో వారిని ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్​ మాట్లాడుతూ ప్రభుత్వం పోడు భూముల విషయంలో సానుకూలంగా ఉందని, త్వరలో గ్రామసభలు నిర్వహించి పట్టాలు అందిస్తుందని సూచించారు.  

జర్నలిస్టులపై దాడి..

అశ్వారావుపేట: మండలంలోని వాగోడ్డుగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులకు, పోడు సాగుదారులకు మధ్య జరిగిన ఘర్షణను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై ఫారెస్ట్​ ఆఫీసర్లు దాడి చేశారు. ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేసి సెల్ ఫోన్లను గుంజుకొని జీప్  దగ్గరకు బలవంతంగా లాక్కొని వెళ్లారని జర్నలిస్టులు భాస్కర్, వినోద్, వెంకటేశ్వరరావు ఆరోపించారు. బుధవారం రాత్రి ఎస్సై అరుణకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అనంతరం దాడికి పాల్పడిన ఫారెస్ట్ గార్డ్ సంపత్ తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోడు సాగుదారులతో కలిసి విలేకరులు నల్ల బ్యాడ్జీలు ధరించి రింగ్ రోడ్డు సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

స్టీల్ ప్లాంట్ పై మంత్రి ప్రకటన దారుణం

ఖమ్మం, వెలుగు: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. లోక్ సభలో బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడడమే కాకుండా స్వయంగా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడానని తెలిపారు. లెక్కకు మించి లేఖలు కూడా రాశారని చెప్పారు. అయినా కేంద్రంలో కదలిక  లేకుండా పోయిందన్నారు. మంత్రిగా రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాల్సిన కిషన్ రెడ్డి ఇలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. పునర్విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామనే ఒప్పందం ఉందని, ఇప్పుడు మాట తప్పి ఇవ్వలేమని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. కాజీపేట రైల్వే కోచ్  ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా గుజరాత్ తరలించారని, ఇప్పుడు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం లేదని చెప్పారు.

బీఎస్పీ మహిళా కన్వీనర్​గా మల్లిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఎస్పీ కొత్తగూడెం అసెంబ్లీ మహిళా కన్వీనర్​గా పట్టణంలోని శ్రీనగర్​ కాలనీకి చెందిన కోల మల్లికను నియమించారు. పట్టణంలోని పార్టీ జిల్లా ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వీణ నియామక పత్రాన్ని అందజేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్, జిల్లా ఇన్​చార్జి గంధం మల్లికార్జున్​లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సాయి, కల్యాణ్, మాలోత్​ వీరు, రవిశంకర్​ పాల్గొన్నారు. 

కేటీపీఎస్ లో రెస్ట్​ రూమ్​ ప్రారంభం

పాల్వంచ,వెలుగు: పాల్వంచ లోని కేటీపీఎస్ 7వ దశ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కార్మికుల కోసం నిర్మించిన రెస్ట్​ రూమ్​ను తెలంగాణ జెన్కో థర్మల్ డైరెక్టర్ బాదావత్ లక్ష్మయ్య బుధవారం ప్రారంభించారు. కోల్ ప్లాంట్ లో రెస్ట్​ రూమ్​ లేక కార్మికులు ఇబ్బందులు పడకుండా ఈ రూమ్​ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చీఫ్ ఇంజనీర్ పలుకుర్తి వెంకటేశ్వరరావు, ఎస్ఈలు యుగపతి, గుర్రం రాజకుమార్, ఎన్  ధర్మారావు, దుర్గామల్లేశ్వరి, కిరణ్ కుమార్, హరిలాల్, వికాస్, వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.