మాస్టర్ ​ప్లాన్​ అమలుకు భూసేకరణే అడ్డంకి : ప్రియాంక అల

మాస్టర్ ​ప్లాన్​ అమలుకు భూసేకరణే అడ్డంకి :  ప్రియాంక అల
  • భద్రాచలం రామాలయం డెవలప్​మెంట్​ కోసం సన్నాహాలు
  • సీఎం పర్యటన తర్వాత వేగం పెంచిన జిల్లా యంత్రాంగం
  • కలెక్టర్ ​అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

భద్రాచలం, వెలుగు : దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం డెవలప్​మెంట్​ కోసం రూపొందించిన మాస్టర్​ ప్లాన్​ అమలుకు భూసేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం టౌన్​ మాత్రమే మిగిలి చుట్టూ ఉన్న ప్రాంతమంతా పోలవరం ఆర్డినెన్స్ పేరుతో ఆంధ్రాలో కలిసింది. దేవస్థానానికి ఉన్న 889.50 ఎకరాల భూమి ఆంధ్రాలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉంది. ఆలయం తెలంగాణలో, భూములు ఆంధ్రాలో ఉండడంతో అవసరాలకు భూమి ఉపయోగపడడం లేదు.

గోశాల కోసం 109 ఎకరాలకు కేటాయించినా అక్కడి ఆక్రమణదారులు దాన్ని ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో స్వామి ఆలయం డెవలప్​మెంట్ ​చేయాలంటే భూమిలేని పరిస్థితి. 50 ఇండ్లను ఖాళీ చేస్తే కానీ మాస్టర్​ప్లాన్​ అమలు సాధ్యం కాదు. వారికి భూమిని కేటాయించే మార్గాలను అధికారులు వెతుకుతున్నారు. ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించడం కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే మాడవీధుల విస్తరణ విషయంలో 2012లో చేపట్టిన భూసేకరణపై స్థానికులు కోర్టుకెక్కారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా సున్నితంగా వారిని ఒప్పించి సేకరించేలా కలెక్టర్​ ప్రియాంక అల చొరవ తీసుకుంటున్నారు. 

ఇప్పటి వరకు చేసింది.. చేయాల్సింది.. 

మాడవీధుల కోసం 2012లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం కిరణ్​కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో రూ.9కోట్లను కేటాయించింది. 27 ఇళ్లను తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని పరిహారం కోసం రూ.4కోట్లు ఖర్చు చేసింది. కానీ 19 ఇళ్ల వారే భూమి ఇచ్చారు. మిగతా ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించారు. రూ.2కోట్లతో అధికారులు స్టేడియం విస్తరణ పనులు చేశారు. రూ.3కోట్లతో మాడవీధుల విస్తరణ చేపట్టారు. ఇప్పుడు మాస్టర్​ ప్లాన్​ అమలు చేయాలంటే ప్రాకారాల కోసం 50 ఇళ్లను తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

గతంలో కోర్టు కేసుల్లో ఉన్న ఎనిమిది ఇళ్లతో పాటు అదనంగా 42 ఇళ్ల ద్వారా 1.2 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. మొదటి ప్రాకారం 29వేల చదరపు అడుగుల్లో, రెండో ప్రాకారం 50వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. అందులో 23 అడుగుల వెడల్పుతో మాడవీధులు, 40 అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించాలంటే ఈ భూసేకరణ తప్పనిసరి. ఇప్పుడున్న చిత్రకూట మండపం, తూర్పు, పశ్చిమ దిక్కుల్లో ఉన్న ఇళ్లను తొలగించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. కల్యాణ మండపం వైపు 1000 కాళ్ల మండపం కూడా నిర్మించనున్నారు. 

సీఎం చెప్పింది ఇదీ.. 

ఆలయం అభివృద్ధి కోసం నిధులు ఎన్ని కోట్లైనా ఇస్తామని సీఎం రెవంత్​రెడ్డి ఇటీవల భద్రాచలం పర్యటనలో ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో చెప్పారు.  కానీ నిర్మాణాలకు భూమి ఎక్కడ ఉంది? ఎలా సేకరిస్తారు? ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? అనే సందేహాలను ఆయన వ్యక్తపరిచారు. ఈ మీటింగ్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎండోమెంట్​ కమిషనర్, ఇంజినీర్లు ఉన్నారు. తక్షణమే ఆలయ అభివృద్ధి దిశగా ముందుకు కదలాలని కలెక్టర్​ ప్రియాంక అలను సీఎం ఆదేశించారు.
 
చకచకా ఏర్పాట్లు

టెంపుల్​ డెవలప్​మెంట్​ కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు వీలుగా కలెక్టర్​ప్రియాంక అల చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 50 ఇళ్ల యజమానులతో చర్చలు జరిపి ఒప్పించి మాస్టర్ ప్లాన్​ అమలు జరిపే బాధ్యతను ఆమె తీసుకున్నారు. భూసేకరణ కోసం దేవస్థానం ఈవో ఎల్​.రమాదేవి, ఆర్డీవో దామోదర్​తో సమావేశం నిర్వహించి సర్వే టీమ్​లను భద్రాచలం పంపించారు. దీంతో డిప్యూటీ ఇన్స్ పెక్టర్​ ఆఫ్​ సర్వే (డీఐ) నాగరాజు, ఐకేసీ సర్వేయర్​ రాజాబాబు, సర్వేయర్లు నవ్య, వెంకటేశ్​, కృష్ణమూర్తితో పాటు భద్రాచలం ఆర్ఐ నర్సింహారావు సర్వే షురూ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న రెండో వంతెన సమీపంలో సుమారు 1.50 ఎకరం భూమిని గుర్తించారు. ఆలయం చుట్టూ కావాల్సిన భూమిని గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ చేసి అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. 

సర్వే జరుగుతోంది

టెంపుల్ డెవలప్​మెంట్​ కోసం భూమి సేకరణకు సర్వే జరుగుతోంది. టీమ్​లు వచ్చాయి. మూడు రోజుల పాటు సర్వే చేసి గుర్తిస్తారు. మాస్టర్​ ప్లాన్​ ప్రకారం కావాల్సిన భూమిని సేకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రవీందర్​రాజు, ఈఈ, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం