నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, అచ్చంపేట, మార్కండేయ ఎత్తిపోతల లాంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను స్పీడప్ చేయాలని ప్రాధాన్యతా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ప్రస్తుతం తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, రాబోయే మూడు నెలల పాటు సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఎండాకాలం దృష్ట్యా ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా, బోర్ల రిపేర్లు లాంటి ముందస్తు చర్యలు చేపట్టాలని, అలాగే వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
వంగూర్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ‘మన ఇసుక.. మన వాహనం’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే ఇసుక రవాణా జరగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లోని మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో సాగుతున్న ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి ఆమర ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రతి వాహనం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అధికారులేమైనా పొరపాట్లు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
