ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట, వెలుగు: ధాన్యాన్ని త్వరగా మిల్లులకు పంపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మార్కెట్లో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఎక్కడైనా వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.  కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను  పరిశీలించారు.  హమాలీలు, లారీలను అదనంగా ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు.  కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ మాధవి,  తహసీల్దార్ చంద్రశేఖర్, డీఎస్‌‌‌‌‌‌‌‌డీఓ శ్రావణ్ ఉన్నారు.