
వంగూరు, వెలుగు: కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు కలెక్టర్ బాదావత్సంతోషత్ తెలిపారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామస్తులతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. అడిషనల్కలెక్టర్, కొండారెడ్డిపల్లి ప్రత్యేక అధికారి దేవసహాయంతో కలిసి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
రోడ్ల విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్డీఏ చిన్న ఓబులేషు, కల్వకుర్తి ఆర్డీవో జనార్ధన్ రెడ్డి, డీపీవో శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్సంతోష్ ఆదేశించారు. వంగూరు తహసీల్దార్ ఆఫీస్‌ను తనిఖీ చేశారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం వంగూరు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు, పేషెంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. మందుల నిల్వ, ప్రసవాలపై ఆరా తీశారు.
స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేయండి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష జరిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో స్టేజీ, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖలు తమ ప్రగతిని ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
కల్వకుర్తి, వెలుగు: కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని పీఏసీఎస్‌ను తనిఖీ చేశారు. సంఘానికి 405 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తే ఇప్పటివరకు 395 మెట్రిక్ టన్నులను రైతులకు అందజేసినట్లు రిజిస్టర్లో నమోదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కో రైతుకు అవసరానికి మించి యూరియా ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అనంతరం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని ఆయనహెచ్చరించారు.