సోమనపల్లిలో భూకబ్జాపై రెవెన్యూ అధికారుల సర్వే

సోమనపల్లిలో  భూకబ్జాపై రెవెన్యూ అధికారుల సర్వే

చెన్నూరు, వెలుగు: చెన్నూర్​ మండలంలోని సోమనపల్లి శివారులో ఉన్న 306, 1267 సర్వేనంబర్లలోని వివాదాస్పద భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వే నంబర్లలో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సోమనపల్లిలోని బలహీన వర్గాలకు చెందిన 50 కుటుంబాలు ఆ భూమిని కొంతకాలంగా సాగు చేసుకుంటున్నామని, ఆర్థిక పరిస్థితులు బాగాలేక రెండేండ్లు పంటలు వేయకపోవడంతో కొంత మంది కబ్జా చేసి మాదే అంటున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. సదరు భూమిలో తమకు పట్టాలు ఇప్పించాలని కోరారు.

ఈ విషయమై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివేక్ కలెక్టర్​ను కోరగా, ఆయన గత శనివారం తహసీల్దార్ ఆఫీస్​కు వచ్చి ఆరా తీశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆర్ఐ, సర్వేయర్ గ్రామానికి వెళ్లి ఆ భూమిని సర్వే చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. 

పల్లె ప్రకృతి వనం మొక్కలు నరికి కబ్జా..

సోమనపెల్లి శివారులోని సర్వే నంబర్ 306, 1267లో 10 ఎకరాలను బృహత్ ప్రకృతి వనం, రెండెకరాలను రైతు వేదికకు కేటాయించారు. పల్లె ప్రకృతి వనంలో గత ప్రభుత్వం పెంచిన 50 వేల మొక్కలను బీఆర్ఎస్ లీడర్లు రాత్రికి రాత్రే జేసీబీతో తొలగించి భూమిని కబ్జా చేశారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు, తహసీల్దార్, పోలీసులకు కంప్లయింట్ చేసినా అధికారులు స్పందించలేదు.