కౌంటింగ్​ సెంటర్​ పరిశీలన: జి.రవినాయక్

కౌంటింగ్​ సెంటర్​ పరిశీలన: జి.రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఓట్ల లెక్కింపు కోసం పాలమూరు యూనివర్సిటీలోని బిల్డింగ్​లను శనివారం కలెక్టర్  జి.రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్  పరిశీలించారు. జిల్లాలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు సంబంధించి ఒకే చోట ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్​ ఏర్పాటు, సౌలతులు, భద్రత  తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ కౌంటింగ్  కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రిటర్నింగ్  ఆఫీసర్లపై ఉందన్నారు.

ఈసీ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్​ ఎస్  మోహన్ రావు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఎస్పీ మహేశ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రవీంద్రనాథ్, సర్వే ల్యాండ్  రికార్డ్స్  అధికారి కిషన్ రావు పాల్గొన్నారు.

పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి

ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవోలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్  సూచించారు. కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో సెకండ్​ లెవల్​ మాస్టర్  ట్రైనర్ల​శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పీవీ, ఏపీవోలకు శిక్షణ ఇచ్చేందుకు నియమించబడిన మాస్టర్  ట్రైనర్లు సరైన శిక్షణ తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 62 కేసులు నమోదు చేశామని, రూ.2.48 కోట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. 42 కేసులకు అప్పీళ్లు రాగా, వాటిని పరిశీలించి సరైన ఆధారాలు చూపించిన తరువాత రూ.1.35 కోట్లను రిలీజ్​ చేసినట్లు చెప్పారు.