రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్మి మద్దతు ధర పొందాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పత్తి కొనుగోళ్లపై మంగళవారం ఆమె రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేట మండలంలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు తమ సమీపంలోని సెంటర్లలో పత్తి అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు.
పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాల్‌కు రూ.7,689 నుంచి రూ.8,110 మద్దతు ధర ఉందని, ‘కపాస్ కిసాన్ యాప్’లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, డీఏవో అఫ్జల్ బేగం, సీపీవో రఘురామ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం అందజేయనున్న ఉపకరణాల పంపిణీ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం ఆమె అలింకో, ఏడీఐపీ, ఆర్వీవై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇల్లంతకుంట క్యాంపును సందర్శించారు.
జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉపకరణాలు, సహాయక పరికరాల గుర్తింపు కోసం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆమె ఇల్లంతకుంటలోని కొనుగోలు కేంద్రాలను విజిట్ చేశారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎంపీడీవో శశికళ, తదితరులు ఉన్నారు.
