దరఖాస్తుల పట్ల తక్షణమే స్పందించాలి : కలెక్టర్ హైమావతి

దరఖాస్తుల పట్ల తక్షణమే స్పందించాలి : కలెక్టర్ హైమావతి

ప్రజావాణిలో భాగంగా వినతులు స్వీకరించిన కలెక్టర్ ​హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్​హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్​లో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 131 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క అర్జీని ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్​వో నాగరాజమ్మ పాల్గొన్నారు. 

అనంతరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేసినప్పుడు వైద్య సిబ్బంది హాజరు విషయంలో తప్పులను గుర్తించినట్లు చెప్పారు. అందుకే అన్ని ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టి హాజరు నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ధన్ రాజ్ ను ఆదేశించారు. అనంతరం జాతీయ స్థాయిలో విజయం సాధించిన బేగంపేట స్టూడెంట్స్ కార్తీక, హర్షవర్ధన్, చైతన్య ను కలెక్టర్ అభినందించారు. 

నంగునూర్ మండలం లోని నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు చెప్పారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీ లోపల బీటీ రోడ్ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్​ఆఫీసర్​సువర్ణ, డీఏవో స్వరూప రాణి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆయిల్ పామ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. 

ప్రజావాణికి  40  దరఖాస్తులు

సంగారెడ్డి టౌన్: ప్రజావాణి  దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్  ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంలో  40 దరఖాస్తులు అందాయని తెలిపారు.  అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజావాణి లో అందిన ప్రతీ దరఖాస్తు పరిష్కారమయ్యే వరకు ఫాలోఅప్  చేయాలని అధికారులకు సూచించారు.