గొల్లభామ’కు బ్రాండ్ క్రియేట్ చేయాలి : కలెక్టర్ హైమావతి

గొల్లభామ’కు బ్రాండ్ క్రియేట్ చేయాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: గొల్లభామ ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్​చేయాలని కలెక్టర్ ​హైమావతి అన్నారు. గురువారం ఆమె సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి హాజరై  మాట్లాడారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం అందరూ కలిసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఇకపై ప్రతి సోమవారం తాను కాటన్ వస్త్రాలను ధరించడంతో పాటు అధికారులందరూ ధరించేలా చూస్తానని తెలిపారు. చేనేత వస్త్రాల తయారీలో మహిళలు సంఘంగా ఏర్పడితే స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక తోడ్పాటు కోసం బ్యాంకర్ల ద్వారా రుణం అందిస్తామని తెలిపారు.

 గత 40 నుంచి 50 ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న పలువురు నేత కార్మికులను సన్మానించారు. వ్యాసరచన, స్పీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను చాటిన విద్యార్థినులను సత్కరించారు. తదనంతరం నేతన్న పొదుపు పథకం కింద 550 మంది లబ్ధిదారులకు రూ.15,84,000 వేల చెక్కును అందజేశారు. అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, చేనేత జౌళి శాఖ అధికారి సాగర్, డీపీవో దేవకీదేవి, జడ్పీ సీఈఓ రమేశ్ పాల్గొన్నారు. 

మెనూ తప్పనిసరిగా పాటించాలి

స్కూళ్ల లో మెనూ ను తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు రుచికరంగా భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామంలోని జడ్పీ, ఎంపీపీఎస్ స్కూళ్లను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీం నగర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

 అనంతరం కలెక్టరేట్ లో గజ్వేల్ అర్ అండ్ ఆర్ కాలనీ సమస్య, సిద్దిపేట డివిజన్ పలు కెనాల్ భూ సేకరణ పై అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.