యూరియా కోసం ఆందోళన చెందవద్దు : కలెక్టర్ హైమావతి

యూరియా కోసం ఆందోళన చెందవద్దు : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: యూరియా కోసం ఆందోళన చెందవద్దని, రైతులందరికీ సరిపోయేంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ హైమావతి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వానాకాలానికి సంబంధించి మన జిల్లాకు 31,931 టన్నుల యూరియా అవసరం ఉండగా ప్రభుత్వం 26,500 టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. ఆ యూరియాను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులకు సరఫరా చేశామన్నారు. 

ఆగస్టు 31 వరకు మరో 5500  టన్నుల యూరియాను ప్రభుత్వం  అలాట్​ చేస్తుందన్నారు. ప్రైవేట్ డీలర్స్ ద్వారా మరో వెయ్యి టన్నుల  యూరియా ఇస్తుందన్నారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ యూరియా సరఫరాపై పర్యవేక్షిస్తూ కావలసినంత యూరియా జిల్లాకు వచ్చేలా కృషి చేస్తున్నారన్నారు.

పీహెచ్​సీ ఆకస్మిక తనిఖీ

కోహెడ: కోహెడ మండల కేంద్రంలోని పీహెచ్ సీని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్, ఇన్ పేషంట్, ఆరోగ్య మహిళ, వ్యాక్సినేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో ఎలాంటి లీవ్ శాంక్షన్ లేకుండా గైర్హాజరైన  సిబ్బంది విజయ, సతీశ్​కుమార్, మెడికల్ లీవ్ లో ఉన్న ఆయుష్ డాక్టర్ కిరణ్ కుమారి, డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసినా రిటర్న్​​వెళ్లకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న స్టాప్ నర్స్​ పూజపై చర్య తీసుకోవాలని డీఎంహెచ్​వోకు సూచించారు. ఔట్​పేషెంట్ రిజిస్టర్ ను కచ్చితంగా మెయింటైన్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహమ్మద్ సమీర్ ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య ఉన్నారు.

చేర్యాల, మద్దూరు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక​పర్యటన

చేర్యాల: చేర్యాల, మద్దూరు మండలాల్లో కలెక్టర్​ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. చేర్యాల నుంచి కడవేర్గు గ్రామ పరిధిలో ఉండే లో- లెవెల్ వంతెన, మద్దూరు మండలంలోని గాగిలాపూర్ గ్రామ పరిధిలోని లో- లెవెల్ వంతెనలను పరిశీలించారు. లో-లెవెల్ వంతెనపై నుంచి నీరు వెళ్తే రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ పికెటింగ్ సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఆర్అండ్ బీ ఏఈ ఉన్నారు.