- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, వెలుగు: ధాన్యం17 శాతం తేమ వచ్చే విధంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో బాగా ఆరబెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సరైన తేమశాతం, నాణ్యతా ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, అవసరమైన లారీలు, హమాలీలు, కాంటాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.
గురువారం నల్గొండ మండలం జి. చెన్నారం, చర్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, డీఎస్ఓ వెంకటేశ్, పౌర సరఫరాల డీఎం గోపికృష్ణ, తహసీల్దార్ పరశురామ్ ఉన్నారు.
బాలల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం
నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రతి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జి. సరిత, ఎం. చందన నల్గొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కేజీబీవీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో అమలు చేస్తున్న విద్య, అంగన్వాడీలు, పౌష్టికాహారం, ప్రత్యేకించి బాలికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సరిత,చందన మాట్లాడుతూ.. జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఉన్నారు.
