సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్​లో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో బ్రోస్ ఫౌండేషన్, ఆప్టిమస్ ఫార్మాసూటికల్, సెగ్మెంట్ ఫార్మాసిటికల్, లోక్ భారతి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్​ద్వారా టీబీ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌష్టికాహార లోపం వల్ల టీవీ వస్తుంది.. కాబట్టి  వైద్య సిబ్బంది టీవీ రోగులను గుర్తించి న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా అందించాలని సూచించారు. 

టీబీతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా ఆరు నెలలపాటు మందులు వాడాలని, మధ్యలో మానేస్తే జబ్బు తగ్గదని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో కోట చలం, డిప్యూటీ డీఎంహెచ్​వో జయమనోహరి, టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నజియా, డాక్టర్  వెంకటపాపిరెడ్డి పాల్గొన్నారు. 

భూ సమస్యల పరిష్కారం కోసమే సదస్సులు 

గరిడేపల్లి, వెలుగు : భూ సమస్యలను పరిష్కరించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం వెలిదండ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 

రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.