భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 17వ తేదీ నుంచి సీఎం కప్ పోటీలు మొదలు కానున్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. పలు శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామపంచాయతీ స్థాయి, 28నుంచి 31 వరకు మండల స్థాయి, వచ్చే నెల 3 నుంచి ఏడో తేదీ వరకు నియోజకవర్గ స్థాయి, 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలుంటాయన్నారు.
ఈ పోటీలకు జిల్లాను 77క్లస్టర్లుగా విభజించినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పొటీలకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలుంటాయన్నారు. గ్రామీణ, నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో 21 రకాల క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు.
సీఎం కప్ పోటీలపై ముమ్మరంగా ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. సీఎం కప్ మొబైల్ యాప్ ద్వారా కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రతి గ్రామంలో కనీసం రెండు మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. బాలురు, బాలికలకు వేర్వేరు మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. స్టూడెంట్స్ తో పాటు అన్ని వయసుల క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
