టాప్లి–ట్ అప్‌ డ్రాఫ్ట్ పద్ధతిలో నాణ్యమైన బయోచార్ తయారీ : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

టాప్లి–ట్ అప్‌ డ్రాఫ్ట్ పద్ధతిలో నాణ్యమైన బయోచార్ తయారీ : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

సుజాతనగర్, వెలుగు : తక్కువ ఆక్సిజన్‌ తో కట్టేముక్కలను మండించడం ద్వారా నాణ్యమైన బయోచార్ తయారవుతుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్ అన్నారు. మండలంలోని వేపలగడ్డలో ప్రయోగాత్మకంగా తయారు చేసిన బయోచార్ యూనిట్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ ప్రక్రియలో 30 కిలోల వేస్ట్  కర్రలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మండించడం ద్వారా 10 కిలోల నాణ్యమైన బయోచారు తయారు చేయగలిగారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎండిన చెట్లను బొగ్గుగా మార్చే సాంప్రదాయ పద్ధతిలో ఎక్కువ శాతం బూడిదగా మారుతుందని,  దీనిని అధిగమించే చర్యల్లో భాగంగా ఒక కొత్త విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇలా తయారైన బయోచార్ ను ఆవుపంచకంతో కలిపి కొన్ని రోజులు నిల్వ ఉంచి ఆరబెట్టి, పొడిగా చేసి పంటలకు ఎరువుగా ఉపయోగించాలని సూచించారు. 

మండలంలోని నాలుగు రైతువేదికల ద్వారా తయారీ విధానం గురించి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో విరివిగా లభించే సర్కారు తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు,  కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తక్కువ ఆక్సిజన్‌లో టీఎల్‌యూ‌డీ(టాప్–--లిట్ అప్‌డ్రాఫ్ట్) పద్ధతిలో బయోచార్ తయారు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు దీన్ని తయారు చేసి విక్రయించి లాభం పొందవచ్చన్నారు. ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే వేడిని ఎలా ఉపయోగించుకోవచ్చో,  తయారీ విధానాన్ని మరింత తక్కువ ఖర్చుతో సులభతరంగా రైతులు ఉపయోగించుకునేలా రూపొందించడానికి వివిధ పద్ధతులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. యూనిట్ తయారీకి సహకరించిన కుందురు లక్ష్మీ నారాయణ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఏవో  నర్మద, ఎంపీడీవో భారతి పాల్గొన్నారు.