
బూర్గంపహాడ్, వెలుగు : పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వీ పాటిల్ బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లను హెచ్చరించారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మించనున్న సీహెచ్ సీ స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని ఇతర సీహెచ్సీలతో పోల్చుకుంటే బూర్గంపహాడ్ సీహెచ్ సీ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి పేషెంట్లు సరిగా రావడంలేదని హెడ్ నర్సు చెప్పే ప్రయత్నం చేయగా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ‘మీరు సరిగ్గా పనిచేస్తే పేషెంట్లు ఎందుకు రారు.
జీతాలు సరైన సమయంలోనే తీసుకుంటున్నారు కదా.. మరి పనిలో ఎందుకు నిర్లక్ష్యం.. నేను కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ నా దగ్గరకు ప్రజలు రావడం లేదని నేను ఇంట్లో పడుకుంటే సరిపోతుందా.. నేనే ప్రజల దగ్గరకు వెళ్లాలి.. అలాగే మీరు కూడా రోగులకు సరైన వైద్యం అందిస్తుంటే రోగులు సంఖ్య ఎందుకు పెరగదు’ అని ప్రశ్నించారు. ఇపై రోజూ ఏదో ఒక విధంగా ఆస్పత్రిని తనిఖీ చేస్తానని, ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కొత్త సీహెచ్సీ భవ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేసేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్, డీసీహెచ్ఎస్ రవిబాబుకు సూచించారు. అనంతరం బూర్గంపహాడ్ లోని గురుకుల బాలికల కళాశాలను సందర్శించారు. మంచినీటితో పాటు పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో జమలారెడ్ది, ఆస్పత్రి సూపరింటెండెంట్ ముకంటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.