ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పీఎం కిసాన్‌‌ యోజన దరఖాస్తులు పరిష్కరించాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

నారాయణపేట, వెలుగు :   పెండింగ్‌‌లో ఉన్న పీఎం కిసాన్ యోజన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్‌‌ హాల్‌‌లో మండల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా  జిల్లాలో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి..?  ఎక్కువగా  ఏ పంటల పండిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  పీఎం కిసాన్‌‌ అప్లికేషన్లతో పాటు పంటల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని సూచించారు.  వరి కొనుగోలు, రైతు బంధు,  రైతు బీమా అమలులో ఎట్టిపరిస్థితుల్లో జాప్యం ఉండొద్దన్నారు. ఫర్టిలైజర్‌‌‌‌ దుకాణాల్లో  అక్రమంగా  ఎరువులను నిల్వ ఉంచితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవో, ఏఈవోలు ఫీల్డ్ విజిట్ చేసి  ఆయిల్ ఫామ్‌‌ తోటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ ఉన్నారు. 

క్రిష్టియన్‌‌పల్లి బాధితులకు ఇండ్లివ్వాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను టీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కారు వాపస్ తీసుకొని అన్యాయం చేస్తోందని సీపీఎం నేతలు మండిపడ్డారు.  సోమవారం మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు.  వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రం సమీపంలోని క్రిష్టియన్ పల్లి వద్ద  గత ప్రభుత్వం 2 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ స్థలాన్ని డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇండ్ల కోసం తీసుకున్న సర్కారు బాధితులకు ఇండ్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు.  కొందరికి మాత్రమే ఇండ్లు ఇచ్చి మిగతా వారికి అన్యాయం చేసిందని మండిపడ్డారు.  వెంటనే అర్హులైన వారికి  ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌‌‌‌ పార్థసారధికి వినతి పత్రం ఇచ్చారు. సీపీఎం నేతలు చంద్రకాంత్, ఆదివిష్ణు, జగీర్ వెంకటమ్మ, గౌసియా పాల్గొన్నారు.   

ప్రజల భాగస్వామ్యంతో టీబీని నిర్మూలించొచ్చు : అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  ప్రజల భాగస్వామ్యంతో టీబీని పూర్తిగా నిర్మూలించ వచ్చని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు. సోమవారం రెవెన్యూ మీటింగ్ హాల్‌‌ టీబీ వ్యాధిపై రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.  దేశంలో 2025 నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం పీఎంటిబి ముక్త్‌‌ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.  టీబీ రోగులకు చేయూతనివ్వడంతో పాటు వ్యాధి రాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.  డిప్తీరియా కేసులు పెరగకుండా 10 ఏళ్లు, 16 ఏళ్లు పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ పై సమీక్షించారు.  జిల్లాలో 15వేల మంది చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం టీబీ పేషెంట్లకు రోగులకు మందులతో పాటు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. 

స్టూడెంట్స్ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి : కలెక్టర్ ఎస్.వెంకట్ రావు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  జిల్లాలోని కేజీబీవీ స్టూడెంట్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్‌‌ నుంచి కేజీబీవీ ఎస్‌‌వోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా..  తన దృష్టికి తేవాలని ఉత్తమ ఫలితాలకు చొరవ తీసుకోవాలని కోరారు.  చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.  కేజీబీవీలలో ఇప్పటికే ఆర్చరీ, తైక్వాండో లాంటి క్రీడలు ఆడిస్తున్నామని,  ఈ ఏడాది  మరో రెండు  క్రీడలను తీసుకొచ్చామన్నారు. కల్చరల్ మీట్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.   శిక్షణ ఇచ్చేందుకుగాను కొరియోగ్రాఫర్‌‌‌‌ను నియమించుకోవాలని సూచించారు.  కేజీబీవీల  నిర్వహణను  నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఈవో రవీందర్,  జీసీడీవోవో తదితరులు పాల్గొన్నారు. 

డాక్టర్ల నిర్లక్ష్యంతో పురిట్లోనే ప్రాణం పోయింది
ఆస్పత్రి ముందు బాధితులు ఆందోళన  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  డాక్టర్ల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసిబిడ్డ ప్రాణం పోయింది.  బాధితుల వివరాల ప్రకారం..  బల్మూరు మండలానికి చెందిన జి.శైలజ అక్టోబర్ 17న పురిటి నొప్పులతో నాగర్ కర్నూల్‌‌‌‌లోని ప్రగతి నర్సింగ్ హోమ్‌‌‌‌లో అడ్మిట్ అయ్యారు.  పరీక్షలు నిర్వహించిన ఇంకా సమయం ఉందని అక్టోబర్ 27 వరకు డెలివరీ  చేయలేదు.  28న తెల్లవారుజామున 3 గంటలకు బిడ్డ హార్ట్‌‌‌‌బీట్ తక్కువగా ఉందని,  వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆ కుటుంబం కర్నూల్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడి డాక్టర్లు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయగా.. అప్పటికే చనిపోయింది. మూడు రోజుల కిందనే  బిడ్డ మృతి చెంది ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో  సోమవారం కుటుంబసభ్యులు ప్రగతి నర్సింగ్‌‌‌‌ హోమ్ ముందు ఆందోళనకు దిగారు.  విషయం తెలుసుకున్న పోలీసులు బాధితులకు సర్దిచెప్పారు. మధ్యవర్తుల ద్వారా కాంప్రమైజ్ అయినట్లు తెలిసింది.  

బైక్‌‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
పెబ్బేరు, వెలుగు :
 బైకును లారీ  ఢీకొట్టడంతో  వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..  గద్వాల జిల్లా బోరవెల్లి గ్రామానికి చెందిన వెంకట్రాములు(42) జాతర్లలో పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  కురుమూర్తి జాతరలో బొమ్మలు అమ్మేందుకని సోమవారం రాత్రి స్వగ్రామం నుంచి బయల్దేరాడు.  పెబ్బేరు మండలం రంగాపూర్​సమీపంలో  రాగానే.. ఏబీడీ లిక్కర్​కంపెనీ నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో వెంకట్రాములు అక్కడికక్కడే మృతి చెందాడు.  స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా  స్థలానికి చేరుకొని డెడ్​బాడీని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకట్రాములు అతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.  వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రామస్వామి తెలిపారు.

పాదుకలకు పాహిమాం..
పేదల తిరుపతి కురుమూర్తి స్వామి వారి పాదుకలు తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.  బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ఉద్దాలోత్సవంలో భాగంగా..  సోమవారం పూజారులు ఉద్దాలను  సీసీకుంట మండలం పల్లమర్రి  నుంచి  వడ్డేమాన్‌‌, తిర్మలాపూర్‌‌‌‌ మీదుగా కురుమూర్తి జాతర మైదానానికి ట్రాక్టర్‌‌‌‌లో ఊరేగింపుగా తీసుకొచ్చారు.  ఈ సందర్భంగా భక్తులు బంతిపూలు ధరించి, నెమలి పించాలు చేతబట్టి  సిగాలు ఊగుతూ ఎదుర్కోలుగా వెళ్లి  ఉద్దాలను తాకారు.  అంతకుముందు కోనేరులో స్నానాలు చేసి..  స్వామివారికి దాసాంగాలను నైవేద్యం పెట్టడంతో పాటు గండ జ్యోతిని టెంపుల్‌‌ ముఖద్వారం వద్ద ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం కాంచన గుహలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్​ రెడ్డి జడ్పీ చైర్‌‌‌‌ పర్సన్‌‌ స్వర్ణసుధాకర్​ రెడ్డి ,  మాజీ ఎమ్మెల్యే సీతాదయకర్​రెడ్డి దంపతులు, ఎంపీపీలు హర్షవర్దన్​ రెడ్డి, రమా శ్రీకాంత్​ యాదవ్ పాల్గొన్నారు.

- మహబూబ్‌‌నగర్‌‌‌‌ స్టాఫ్ ఫొటో గ్రాఫర్‌‌‌‌, దేవరకద్ర, వెలుగు

మహిళా సమాఖ్య కొత్త కమిటీని రద్దు చేయాలి

పానగల్, వెలుగు :  పానగల్ మండల సమాఖ్య కొత్త కమిటీని రద్దు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి  లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం మహిళా సంఘం సభ్యులతో కలిసి ఎంపీడీవో  కార్యాలయం ముందు ధర్నా  చేసి ఎంపీపీ శ్రీధర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గ్రామ మహిళా సంఘాల ప్రెసిడెంట్లకు తెలియకుండానే గత నెలలో ఏపీఎం కొత్త కమిటీని ఎన్నుకున్నారని మండిపడ్డారు.  ఏకపక్షంగా  నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.  ప్రభుత్వం స్పందించి కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కవిత, సాయినీల, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు అలివేలమ్మ,  మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి

ఉప్పునుంతల(వంగూర్),వెలుగు : వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక బాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో  తహసీల్దార్‌‌‌‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు.  నకిలీ ఎరువులు,  విత్తనాలు,  పురుగు మందుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నాయని వాపోయారు.  జిల్లాలో ఇటీవల కురిసన వర్షాలకు  పత్తి, వేరుశనగ, వరి పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టం అంచనా వేసి ఎకరాకు రూ. 20 వేల పరిహారం ఇవ్వాలని కోరారు.  అనంతరం తహసీల్దార్ రాజు నాయక్‌‌కు  వినతి పత్రం 
అందజేశారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా అధ్యక్షుడు  ఆంజనేయులు, సీఐటీయూ నేత బండపల్లి శివరాములు,  రైతు సంఘం మండల కార్యదర్శి దెందితిరుపతి రెడ్డి, అధ్యక్షుడు ప్రశాంత్, ఉపాధ్యక్షులు రాములు, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య, నేతలు బాల్ లింగయ్య, జూపల్లి మల్లేశ్, శివ, జనార్దన్ రెడ్డి,  రైతులు పాల్గొన్నారు.  

నల్లచెరువులో పాప మృతదేహం

వనపర్తి, వెలుగు : జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు (మినీ ట్యాంక్ బండ్ )లో సోమవారం నెల కూడా నిండని పాప మృతదేహం లభ్యమైంది.  సోమవారం ఉదయం వాకింగ్‌‌కు వచ్చిన వ్యక్తులు గుర్తించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని శిశువు మృతదేహాన్ని బయటికి తీయించారు. అనంతరం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల వద్దనుకున్న తల్లిదండ్రులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : 1983,84,85, 89లో నియామకమైన స్పెషల్ టీచర్లకు పని చేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌‌‌‌   బహిరంగ లేఖను రాశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ  40 ఏళ్ల కింద సర్వీస్‌‌లో చేరిన టీచర్లకు అన్యాయం చేయడం సరికాదన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం రాగానే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తానని కేసీఆర్‌‌‌‌ మాట ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లైనా  పట్టించుకోవడం లేదని వాపోయారు.  సంఘాలకు నాయకత్వం వహించిన నాయకులు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వ్యక్తులు స్పెషల్ టీచర్లు అయినప్పటికీ నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధించలేకపోయారన్నారు.  ఏపీలో 2019 మార్చి 1న ఇచ్చినట్లుగా రాష్ట్రంలోనే అమలు చేయాలని కోరారు. 

పటేల్, ఇందిర యాదిలో..
తొలి హోం మంత్రి సర్దార్ వల్లా భాయ్ పటేల్‌‌, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సోమవారం ఉమ్మడి జిల్లా ప్రజలు యాదిజేసుకున్నారు.  పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.  అనంతరం సిబ్బందితో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఇందిరా వర్ధంతి కావడంతో కాంగ్రెస్‌‌ ఆధ్వర్యంలో ఆమె ఫొటోలు, విగ్రహాలకు పూలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత్ సాధించిన ఘనత పటేల్‌‌కు, రాజాభరణాలు రద్దు, బ్యాంకుల జాతీయంతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఘనత ఇందిరకు దక్కుతుందన్నారు. 
– నెట్‌‌వర్క్‌‌, వెలుగు