
- కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: తప్పులు లేకుండా ఓటర్ జాబితాను తయారు చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ జాబితా తప్పొప్పుల సవరణకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. ఓటర్ జాబితా నుంచి తొలగింపునకు ఫామ్7, చిరునామా మార్పు, పేరులో తప్పొప్పులకు ఫామ్ 8 నింపాలన్నారు. కుటుంబ సభ్యులందరికి ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉండేలా ప్రణాళిక చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విత్తనాల పోస్టర్ విడుదల
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందిస్తుందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ లో విత్తనాలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. విత్తనాలను అన్ని మండలాల్లోని పీఎసీఎస్, ఏఆర్ఎస్ కేఎస్, డీసీఎంఎస్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. టీజీ సీడ్స్ సొంత విక్రయ కేంద్రాల్లో డిస్కౌంట్ లో విత్తనాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో డీఏవో శివప్రసాద్, ఆర్డీవో పాండు, సీడ్స్ రీజినల్ మేనేజర్ కోటిలింగం పాల్గొన్నారు.
వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించాలి
వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య అధికారులకు కలెక్టర్క్రాంతి సూచించారు. వేసవి సమయంలో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. ఉపాధి హామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా ప్లాన్చేసుకోవాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని
సూచించారు.