విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, వెలుగు : గవర్నమెంట్​స్కూళ్లలో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ టీచర్లకు సూచించారు. బుధవారం నెన్నెల కేజీబీవీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. క్లాస్​ రూమ్​లు, రిజిస్టర్లు, కిచెన్​ షెడ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్​పెట్టాలన్నారు. 

అనంతరం టెన్త్​ స్టూడెంట్లకు ఫిజిక్స్ సబ్జెక్టులో పలు అంశాలను బోధించి వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. జడ్పీ హైస్కూల్​కు వెళ్లిన కలెక్టర్​అక్కడ నిర్మాణంలో ఉన్న టాయ్​లెట్స్​పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టెన్త్​ స్టూడెంట్లను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ, నిత్యావసర సరుకులు నిల్వ చేసే గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్​ను సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. 

ఒకటి నుంచి పత్తి కొనుగోళ్లు..

జిల్లాలో నవంబర్ ఒకటి నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్టు కలెక్టర్ కుమార్ దీపక్​తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్​ పి.చంద్రయ్య, డీఏవో సురేఖ, మార్కెటింగ్ ఆఫీసర్​ షహబుద్దీన్, సీపీవో సత్యంతో కలిసి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

పత్తి విక్రయాలకు కపాస్ కిసాన్ యాప్​లో రైతులు తమ వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పత్తి జిల్లాలోకి రాకుండా బోర్డర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.