
చెన్నూరు, వెలుగు: జిల్లాలో సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని మంచిర్యాల కలెక్టర్ కుమర్ దీపక్ తెలిపారు. ఆదివారం చెన్నూరు మండలం సుద్దాలలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి యామిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్‌తో కలిసి తనిఖీ చేశారు. నిల్వల రిజిస్టర్లను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లాలో పంట సాగుకు అవసరమయ్యే యూరియా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరానికి మించి యూరియా తీసుకోవద్దని రైతులకు సూచించారు. యూరియా పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు చెన్నూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులకు శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్, ఓటర్ స్లిప్పుల పంపిణీ, ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లతోపాటు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
గోదావరి నీటిమట్టాన్ని నిత్యం పర్యవేక్షించాలి
నస్పూర్, వెలుగు: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరద కారణంగా గోదావరి నది నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఆదివారం మంచిర్యాల కాలేజ్ రోడ్డులోని గోదావరి తీరంలో వరదను పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కడెం, ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేశారని, దీంతో గోదావరిలో చేరుతున్న నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.